ఆ సొమ్ము.. చాలా మందికివ్వాలి: లంచంపై ఉన్న‌తాధికారి కామెంట్స్‌

ఏపీలో ఓ ఉన్న‌తాధికారి ఏకంగా 25 ల‌క్ష‌ల రూపాయ‌లు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు అవినీతి అధికారులు న‌మోదు చేసిన కేసుల్లో ఫ‌స్ట్ కేసు.;

Update: 2025-08-08 09:51 GMT

ఏపీలో ఓ ఉన్న‌తాధికారి ఏకంగా 25 ల‌క్ష‌ల రూపాయ‌లు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు అవినీతి అధికారులు న‌మోదు చేసిన కేసుల్లో ఫ‌స్ట్ కేసు. ఇంత భారీ మొత్తంతో రెడ్ హ్యాండెడ్‌గా ఆయ‌న చిక్కారు. పాతిక ల‌క్ష‌ల రూపాయ‌లు చాల‌వ‌ని.. మ‌రో పాతిక ల‌క్ష‌లు తీసుకురావాల‌ని స‌ద‌రు అధికారి డిమాండ్ చేయ‌డంతో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించారు. అయితే.. ఏసీబీ అధికారుల విచార‌ణ‌లో స‌ద‌రు అధికారి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌కంప‌న‌లు సృష్టించింది.

ఎవ‌రు.. ఏంటి?

ఏపీలోని గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు చెందిన‌.. ఇంజ‌నీరింగ్ ఇన్ చీఫ్‌(ఈఎన్‌సీ)గా ప‌నిచేస్తున్న ఉన్న‌తాధికారి.. తాజాగా ఓ కాంట్రాక్ట‌ర్ నుంచి 25 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌డంగా ఏసీబీ అధికారులు దాడులు చేసి.. అత‌నిని అరెస్టు చేశారు. అయితే.. ఈ 25 ల‌క్ష‌లు త‌న‌కు స‌రిపోవ‌ని.. మ‌రో 25 ల‌క్ష‌లు తీసుకురావాల ని స‌ద‌రు కాంట్రాక్ట‌ర్‌ను అధికారి కోర‌డంతో విష‌యం ఏసీబీ అధికారుల వ‌ర‌కు చేరి.. తొలి విడ‌త‌లోనే.. ఆయ‌న‌ను ప‌ట్టుకున్నారు. అనంత‌రం స్టేష‌న్‌కు త‌ర‌లించి విచారించారు.

ఈ సంద‌ర్భంగా స‌ద‌రు అధికారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ సొమ్ము మొత్తం త‌న‌కు మాత్ర‌మే కాద‌ని.. దీనిలో పై స్తాయిలో అనేక మందికి వాటా ఉంద‌ని వ్యాఖ్యానించారు. తాను చెప్ప‌మంటే పేర్లు కూడా చెబుతాన‌ని.. త‌న‌ను అన్యాయంగా ఇరికించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు.. దీనిలో పెద్ద స్థాయి నాయ‌కుల‌కు కూడా వాటా ఉంద‌న్నార‌ని తెలిసింది. దీంతో అవాక్క‌యిన పోలీసులు.. ఆయ‌న‌పై కేసు పెట్టినా.. మ‌రింత లోతుగా విచారించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రి ఆ పైవారి పేర్ల‌ను బ‌య‌ట పెడ‌తారా? లేదా? అనేది చూడాలి.

ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి తిమింగ‌లాలు ఏపీలో ప‌ట్టుబ‌డుతున్నా.. ఎవ‌రూ ఇలా నోరు చేసుకున్న ప‌రిస్థితి లేదు. రెండు కేసుల్లో 10 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌కుండా.. లంచం తీసుకున్న అధికారులు ప‌ట్టుబ‌డ‌గా.. ఇప్పుడు ఏకంగా 25 ల‌క్ష‌లు లంచంగా తీసుకుని, మ‌రో పాతిక ల‌క్షల కోసం డిమాండ్ చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.

Tags:    

Similar News