అయ్యన్నది మళ్లీ అదే మాట.. 11 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఉత్కంఠ!

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏపీ అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది.;

Update: 2025-11-27 08:45 GMT

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏపీ అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై విపక్ష వైసీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పిల్లల సమక్షంలో రాజకీయాలు ఏంటని సభాపతిని నిలదీస్తోంది. ఇంతకీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏం అన్నారు? ఆయన వ్యాఖ్యలతో వైసీపీ ఎందుకలా? ఉలిక్కిపడుతోందన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ గా మారింది.

పిల్లల అసెంబ్లీ ముగిసిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలు ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన తీరుపై ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. భావి భారత పౌరులుగా ఎదిగే క్రమంలో విద్యార్థులు మన రాజ్యాంగం గొప్పతనం తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వం, పాలనపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఇక మాక్ అసెంబ్లీ నిర్వహించిన మంత్రి లోకేశ్ కు అభినందించారు. ఈ సమయంలోనే విపక్షం వైసీపీని ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్న విషయాన్ని మరోమారు ప్రస్తావించారు. అయితే నేరుగా అయ్యన్న ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం విపక్ష వైసీపీ శాసనసభ్యులను టార్గెట్ చేసినట్లే కనిపించాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఉద్యోగం చేయని ఉద్యోగికి జీతం ఇవ్వరని, అదేవిధంగా చట్టసభలకు రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని మాక్ అసెంబ్లీ వేదికగా అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా ఇంటి వద్దే ఉంటూ జీతాలు తీసుకోవడం ఎంతవరకు నైతికమో సమాజం ఆలోచించాలని అయ్యన్న వ్యాఖ్యానించారు. అయితే పిల్లల సమక్షంలో స్పీకర్ అసందర్భ వ్యాఖ్యలు చేశారని వైసీపీ మండిపడుతోంది. ఆ పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్లలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చర్చలు కొనసాగించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు అసెంబ్లీకి రాకపోయినా? ఎందుకు ప్రశ్నించలేదని వైసీపీ మీడియా విమర్శలు గుప్పిస్తోంది.

కాగా, గత కొద్దికాలంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేల జీతభత్యాలు తీసుకోవడాన్ని హైలెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా తమ విధులకు దూరంగా ఉంటున్న వారు.. జీతాలు ఎలా తీసుకుంటారని పదే పదే ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలోనూ బయట కూడా అయ్యన్నపాత్రుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలు డిఫెన్స్ లో పడిపోతున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సభకు రాని ఎమ్మెల్యేలు.. దొంగచాటుగా సంతకాలు చేస్తున్నారని గతంలో స్పీకర్ బయటపెట్టారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి మాక్ అసెంబ్లీ తర్వాత.. శీతాకాల శాసనసభ సమావేశాలకు ముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అగ్గి రాజేయడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News