మరో పండుగకు తెర తీసిన కూటమి సర్కార్
ఏపీలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీతో పాటు మొత్తం రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చి పంపిణీ చేస్తున్నారు.;
ఏపీలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీతో పాటు మొత్తం రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చి పంపిణీ చేస్తున్నారు. దీనికి ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి ఈ పంపిణీ ఏపీలో మొదలవుతోంది. నాలుగు దశలుగా జరిగే ఈ పంపిణీలో తొలిదశలో ఈ నెల 25 నుంచి 30 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో పెద్ద ఎత్తున ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో ప్రారంభిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
వరసగా పంపిణీకి రెడీ :
అదే విధంగా రెండో విడత పంపిణీ అన్నది ఈ నెల 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాలలో సాగుతుంది. ఇక మూడో విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అన్నది సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి లలో సాగుతుంది. చివరి విడత నాలుగో విడతగా సెప్టెంబర్ 15 నుంచి బాపట్ల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టడం జరుగుతుంది.
భారీ ఎత్తున రేషన్ కార్డులు :
ఏపీలో చూస్తే మొత్తం రేషన్ కార్డులు 1 కోటీ 45 లక్షల దాకా ఉన్నాయి. వీటిని రేషన్ కార్డుదారులకు సంబంధించిన రేషన్ దుకాణాల వద్ద గ్రామ వార్డు సచివాలయాల సహకారంతో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వీటితో పాటుగా కొత్తగా ఆరు లక్షల 71 వేల రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు మరో 16 లక్షల 67 వేల 32 రేషన్ కార్డుల దరఖాస్తులకు అప్రూవల్ ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంతే కాదు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని ఆయన అన్నారు. అలా ఆన్ లైన్ లో ధరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.
దేశంలోనే మొదటిసారి :
ఇదిలా ఉంటే దేశంలోనే డిజిటలైజ్ చేసి స్మార్ట్ కార్డుల పంపిణీగా రేషన్ కార్డులను తీసుకువస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్డులలో స్మార్ట్ కార్డుల్లో ప్రభుత్వ చిహ్నంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, వారి భద్రత కోసం క్యూఆర్ కోడ్, కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుందన్నారు. ఇక సమస్యలను చెప్పడానికి టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చన్నారు. 2 నెలలుగా స్మార్ట్ రేషన్ కార్డుల కసరత్తు చేశామన్నారు. చివరి మైలులో ఉన్న వ్యక్తికి కూడా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నాదెండ్ల చెప్పారు.