ఆరు నెలల్లో రాజ్యసభ ఎన్నికలు.. టీడీపీలో మొదలైన పైరవీల పర్వం
ఏపీలో వచ్చే ఏడాది మే-జూన్ నెలల మధ్యలో జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికపై అప్పుడే వేడి మొదలైంది. మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి.;
ఏపీలో వచ్చే ఏడాది మే-జూన్ నెలల మధ్యలో జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికపై అప్పుడే వేడి మొదలైంది. మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ నాలుగు స్థానాలను టీడీపీ కూటమి పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ నుంచి 11 మంది నేతలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు టీడీపీ, ఇద్దరు బీజేపీ కాగా, మిగిలిన ఏడుగురు ప్రతిపక్షం వైసీపీ సభ్యులు. వచ్చే ఏడాది జూన్ లో పదవీ విరమణ చేయనున్న సభ్యుల్లో ముగ్గురు వైసీపీ, ఒక టీడీపీ సభ్యుడు ఉన్నారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ 21తో పూర్తి కానుంది. అదేవిధంగా గత ఏడాది డిసెంబరులో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరఫున గెలిచిన సానా సతీష్ పదవీకాలం కూడా ఆ రోజుతోనే ముగియనుంది.
ఈ నేపథ్యంలో జూన్ కన్నా ముందు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ రాజ్యసభ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అయితే కూటమిలో ప్రస్తుతం ఉన్న పోటీతో పలువురు నేతలు ఇప్పటి నుంచి రాజ్యసభ రేసును మొదలుపెట్టారని అంటున్నారు. కూటమిలో మూడు పార్టీలు ఉండగా, నాలుగు స్థానాలను ఎలా పంచుకుంటాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రాజ్యసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తొలుత మూడు స్థానాలకు, ఆ తర్వాత ఒక స్థానానికి ఎన్నిక జరిగితే టీడీపీ, బీజేపీ చెరో రెండు సీట్లు చొప్పున తీసుకున్నాయి. కూటమిలో మరో భాగస్వామి అయిన జనసేనకు ఇప్పటివరకు రాజ్యసభకు అవకాశం దక్కలేదు.
ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు ఓ సీటు కేటాయిస్తారా? అనేది ప్రధాన చర్చనీయాంశం అయింది. గతంలోనే జనసేన నేత నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తారని భావించారు. అయితే బీజేపీ ఒత్తిడితో జనసేన సీటు వదులుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో మరో ఆరు నెలల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ బదులుగా జనసేన పార్టీకి చాన్స్ వస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ మూడు సీట్లు తీసుకుంటుందా? మిత్రపక్షాలకు చెరోసీటు కేటాయించి రెండు సీట్లతోనే సరిపెట్టుకుంటుందా? అనే చర్చ కూడా జరగుతోంది.
టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీలో రాజ్యసభ సీటు కోసం చాలా పెద్ద పోటీనే కనిపిస్తోందని అంటున్నారు. గత ఏడాది ఎన్నికైన సానా సతీష్ కేవలం ఏడాదిన్నరలోనే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయనకు మళ్లీ రెన్యువల్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మంత్రి లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా సానా సతీష్ గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో కేంద్ర పెద్దల వద్ద ఆయనకు మంచి పరపతి ఉందని అంటున్నారు. దీంతో కేంద్రంతో లాబీయింగ్ కోసం సానా సతీష్ సేవలను వినియోగించుకుంటారని అంటున్నారు. గతంలో ఈ పనిని సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు చేసేవారు. ఆయన కూడా ఇప్పుడు రాజ్యసభ ఆశిస్తున్నారు.
అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన గల్లా జయదేవ్, పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, జవహర్ తోపాటు సీనియర్ నేత వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు తదితరులు కూడా రాజ్యసభ బెర్తును ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉప ఉపముఖ్యమంత్రి పవన్ కోసం సీటు వదులుకున్న పిఠాపురం వర్మకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే వర్మతోపాటు సీటు ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది అగ్రవర్ణాల వారే ఉన్నారని, సామాజిక సమతుల్యం కోసం బీసీ, ఎస్సీ నేతలకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా తెరపైకి తెస్తున్నారు. దీంతో టీడీపీలో రాజ్యసభ రేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.