పెద్ద‌ల స‌భ ఫైట్‌: ఇంకా తేల‌లేదా.. తేల్చ‌లేదా.. ?

పార్ల‌మెంటు పెద్ద‌ల స‌భ‌.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చేసి మూడు రోజులు అయింది. మ‌రో నాలు గు రోజుల్లో నామినేష‌న్ల‌కు గ‌డువు కూడా పూర్తి అవుతోంది.

Update: 2026-06-05 00:30 GMT

పార్ల‌మెంటు పెద్ద‌ల స‌భ‌.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చేసి మూడు రోజులు అయింది. మ‌రో నాలు గు రోజుల్లో నామినేష‌న్ల‌కు గ‌డువు కూడా పూర్తి అవుతోంది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు టీడీపీ తీసుకుని ఒక‌టి జ‌న‌సేన‌కు ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. ప్ర‌స్తుత కోటాలో బీజేపీకి అవ‌కాశం లేద‌ని కూడా తేల్చి చెప్పార‌ని అంటున్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధ‌వ్‌కు స‌మాచారం కూడా చేరిపోయింద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో మూడు స్థానాలుఖ‌చ్చితంగా టీడీపీకే ద‌క్కుతాయ‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఇంకేముంది.. చంద్ర‌బాబు అభ్య‌ర్థుల ఎంపిక కూడా పూర్తిచేశార‌ని.. ఇటీవ‌ల మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యం ఇంచార్జ్ కూడా వెల్ల‌డించారు. `అంతా అయిపోయింద‌మ్మా` అన్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఉలుకు ప‌లుకు లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇటీవ‌ల బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం.. చ‌ర్చించింది. ఏపీ నుంచి ఒక సీటును ఆశిస్తున్న‌ట్టు సంకేతాలు ఇచ్చింది.

అది కూడా మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త‌ను తిరిగి రాజ్య‌స‌భ‌కు పంపించాల్సిన అవ‌స‌రం ఉందని బీజేపీ అభిప్రాయ‌ప‌డుతోంది. వాస్త‌వానికి ప్ర‌స్తుతం 24 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా.. వీటిలో ఏపీలో 4 తీస్తే.. మిగిలిన 20 స్థానాల్లో 10కిపైగా బీజేపీ చేతిలోనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఏపీ సీటుపైనే బీజేపీనేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. దీంతో ఏపీ నుంచి ఒక సీటు కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో ఏపీలో సీట్ల కేటాయింపు సందిగ్ధంలో ప‌డింద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. చంద్ర‌బాబు ముందు కూడా అనేక అభ్య‌ర్థన‌లు ఉన్నాయి. సామాజిక వ‌ర్గాలు.. పార్టీ సీనియ‌ర్లు, త్యాగాలు చేసిన వారు.. ఇలా అనేక మంది నాయ‌కులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఎవ‌రిని ఎంపిక చేయాల‌న్న‌ది ఒక స‌మ‌స్య అయితే.. రెండు సీట్లా.. మూడు సీట్లా అనే విష‌యంలోనూపార్టీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. మ‌రో నాలుగు రోజుల వ‌ర‌కు నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఉన్న ద‌రిమిలా.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. ప్ర‌స్తుత జాబితాలో మాజీ మంత్రి, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత పేరు తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News