నియోజకవర్గం టాక్: కొన్ని ఫుల్లు- కొన్ని నిల్లు!
ఆయా నియోజకవర్గాల్లో నాయకులు వచ్చే ఎన్నికల నాటికి తప్పుకొనే అవకాశం ఉంటుందని అంచనా ఉంది.;
రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. నాయకుల తీరు, పార్టీల తీరును.. వారు వ్యవహరించే విధానాలను బట్టి రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఇక, నాయకుల తీరు తెన్నులు.. నియోజకవర్గాన్ని బట్టి మారుతూ ఉంటా యి. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయాలు ఫుల్లుగా ఉన్నాయి. దీనికి కారణం.. అక్కడ నాయకులకు కొరత లేదు. కానీ, మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నాయకుల కొరత వెంటాడుతోంది.
ఈ పరిస్థితి ప్రతిపక్షం వైసీపీకి మాత్రమే పరిమితం కాలేదు. టీడీపీకి కూడా ఎదురైంది. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నవాటిలోనూ.. వచ్చే ఎన్నికల నాటికి నాయకులను మార్చే ప్రయత్నం చేయాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఎన్నికలకు ముందు అప్పటికప్పుడు కాకుండా.. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే.. మరుసటి ఎన్నికల్లోనూ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు తలపోస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి.
ఆయా నియోజకవర్గాల్లో నాయకులు వచ్చే ఎన్నికల నాటికి తప్పుకొనే అవకాశం ఉంటుందని అంచనా ఉంది. ఇలా మార్పు దిశగా అడుగులు వేస్తున్న నియోజకవర్గాల్లో కొందరు వివాద రహితులు ఉన్నారు. మరికొందరు వివాదాలతోనూ ఉన్నారు. ఉదాహరణకు రాజమండ్రి రూరల్. ఇక్కడ నుంచి చివరి సారి.. అంటూ గత ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి సీటు తెచ్చుకున్నారు. ఈయన వివాద రహితుడే. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి వయసు రీత్యా ఈయనను తప్పించి.. ఈ సీటును జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇక, చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఇక్కడ వేరే నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఈయన ఉన్నా.. లేకున్నా.. మార్పు ఖాయం. ఇక, ఇదేసమయంలో కొన్ని నియోజకవర్గాల్లో లెక్కకు మిక్కిలిగా నాయకులు ఉన్నారు. మైలవరం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో త్యాగాలు చేసిన వారు ఉన్నారు. వాస్తవానికి 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు జరిగితే.. ఇబ్బందులు ఉండవు. లేకపోతే.. మాత్రం మరోసారి నాయకులకు , పార్టీలకు కూడా ఇబ్బందులు తప్పవన్న చర్చ సాగుతోంది.