ప్లాన్ బీ లో జగన్ ...ఏపీ పాలిటిక్స్ లో న్యూ చేంజ్ ?

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఒక ఆసక్తికరమైన ట్వీట్ ని తాజాగా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ పుట్టిన రోజు జనవరి 5.;

Update: 2026-01-06 03:15 GMT

ఏపీలో రాజకీయాలు చూస్తే వైసీపీ విపక్షంలో ఉంది. అయితే ఒంటరి పోరు చేస్తోంది. ఇతర విపక్షాలుగా ఉన్న వామపక్షాలు కానీ కాంగ్రెస్ ని కానీ కలుపుకొని పోవడం లేదు, ఇక అధికార కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీల మధ్య ఎంతో సఖ్యత ఎంతగానో ఉంది. నిజానికి దేశంలో ఏ రాజకీయ మిత్రుల మధ్య లేనంతగా ఈ పార్టీలు సన్నిహితంగా ఉంటున్నాయి. దాంతో 2029 నాటికి మరోసారి కూటమిగానే ఎన్నికల్లో తలపడతాయి. ఇందులో రెండవ మాటకు అయితే తావే లేదని చెప్పాలి. మరి ఒంటరిగా ఉన్న వైసీపీ ఈ కూటమిని ఢీ కొట్టగలదా అన్నది పెద్ద చర్చ.

బీజేపీతో అలా ఉన్నా :

ఇదిలా ఉంటే బీజేపీతో వైసీపీ కెమిస్ట్రీ ఏమిటి దాని కధ ఏమిటి అంటే అదొక బ్రహ్మ పదార్ధంగానే ఉంటుంది. ఎవరికీ అర్థం కాదు, కేంద్రంలో బీజేపీతో వైసీపీ సన్నిహితంగా ఉంటుంది అని అంతా అంటారు. అయితే బీజేపీ మాత్రం తనకు అవసరాన్ని బట్టి చూసుకునే వైసీపీతో మాట్లాడుతుంది. గత ఏడాది జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోసం వైసీపీని సంప్రదించింది. నిజానికి వైసీపీ మద్దతు లేకపోయినా గెలిచేంత బలం బీజేపీకి ఉంది. కానీ వైసీపీని ఎందుకో కాంగ్రెస్ వ్యతిరేక పక్షంగా భావిస్తూ బీజేపీ ఆ కోణం నుంచి చూస్తూ వస్తోంది. ఇక వైసీపీ తీరు కూడా అలాంటిదే. కాంగ్రెస్ తో కలవలేదు కాబట్టి మరో పెద్ద జాతీయ పార్టీగా బీజేపీతో దగ్గర దూరం అన్నది లేకుండా మధ్యేవాదంగా వ్యవహరిస్తోంది అని అంటారు.

ప్రత్యర్థిగానే :

అయితే ఎంత జరిగినా ఏ రకమైన అనుబంధం ఉన్నా ప్రత్యర్థి గానే ఏపీ రాజకీయాల్లో బీజేపీని చూడాల్సి ఉంటుంది. అంతే కాదు కూటమి కి వైసీపీ ఎదురెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ టీడీపీని కాదని అనుకుంటే వైసీపీ బీజేపీతో బాహాటంగా పొత్తుకు సిద్ధపడే సన్నివేశం ఉండదు, ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా దెబ్బతింటుంది. అందువల్ల వైసీపీ నుంచి ఆ సానుకూలత ఉండదు, దాంతో బీజేపీ తన రాజకీయం తాను చూసుకుంటోంది. మరి వైసీపీ తనదైన రాజకీయం తాను చేసుకోవాలి కదా ఇంతవరకూ ఆ దిశగా ఆలోచించిందా అంటే లేదు కానీ ఇపుడిపుడే వైసీపీ కూడా ప్లాన్ బీలో ఉందని అంటున్నారు.

ఇండియా కూటమి వైపు :

దేశంలో చూస్తే రెండే జాతీయ ఫ్రంట్లు ఉన్నాయి. ఒకటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి, అలాగే మరొకటి కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి. టీడీపీ ఉన్నా లేకపోయినా ఎన్డీయే కూటమిలోకి వైసీపీ వెళ్ళే ప్రసక్తి లేదు, ఇపుడు అసలు వీలు కాదు, మరి ఇండియా కూటమిలోకి వెళ్ళవచ్చు కదా అంటే అక్కడ కాంగ్రెస్ ఉంది, అదే వైసీపీ ప్రధాన అభ్యంతరం. మరి ఇండియా కూటమిలోకి వైసీపీ వెళ్ళాలీ అంటే కాంగ్రెస్ నాయకత్వం మారాల్సి ఉంది. అందుకోసమే వైసీపీ చూస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అదే నిజం అని అంటున్నాయి. ఇండియా కూటమి ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలోకి రావాలన్నది వైసీపీ కోరికగా చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీ ఆ కూటమిలో చేరడానికి మార్గం సులువు అవుతుంది అని అంటున్నారు.

మమతా దీదీ మద్దతు :

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఒక ఆసక్తికరమైన ట్వీట్ ని తాజాగా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ పుట్టిన రోజు జనవరి 5. ఆ రోజును గుర్తు పెట్టుకుని మరీ వైఎస్ జగన్ ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మమతా బెనర్జీని గద్దె దించాలని ఒక వైపు బీజేపీ అగ్ర నాయకత్వం శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. బెంగాల్ లో ఈసారి ఎన్నికలు బీజేపీ వర్సెస్ మమతగా హోరాహోరీగా సాగనున్నాయి. ఈ నేపధ్యంలో మమతకు జగన్ గ్రీట్ చేయడం వెనక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు.

నాలుగవ సారి గెలిస్తే :

ఇప్పటికి వరసగా మూడు సార్లు బెంగాల్ సీఎం అయిన మమత బెనర్జీ హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నారు. ఆమె నాలుగోసారి కూడా గెలిస్తే ఇక తిరుగులేని నేతగా జాతీయ రాజకీయాల్లో ఉంటారు అని అంటున్నారు. ఆమె 2029 ఎన్నికల్లో ఏకంగా ప్రధాని అభ్యర్థిగా కూడా ఇండియా కూటమి నుంచి ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. అంతే కాదు ఆమె గెలిస్తే ఇండియా కూటమి సారధ్యం కూడా తీసుకుంటారు అని చెబుతున్నారు. అదే జరిగితే మమతా బెనర్జీ నాయకత్వంలోని ఇండియా కూటమిలో చేరడానికి వైసీపీ ప్లాన్ బీ ని అట్టేబెట్టుకుందా అని ఒక చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. జగన్ సాధారణంగా వేసే ట్వీట్లూ అన్నీ ఆలోచించి ఉంటాయి. సో దీనిని అలాగే చూడాలని అంటున్నారు.

Full View
Tags:    

Similar News