బాబు ప్రభుత్వం నెగిటివ్ నుండి పాజిటివ్ లోకి వచ్చిందా !
చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన తన తీరుని మార్చుకున్నారు.;
ప్రజల ఆశలు ఆకాశానికి తాకుతున్న నేపధ్యంలో ఏ ప్రభుత్వం అయినా ఎంత చేసినా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇక ఏపీలో చూస్తే విభజన తర్వాత మూడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విభజన ఏపీకి తొలి సీఎం అయిన చంద్రబాబు హయాంలో 2014లో సర్కార్ ఏర్పడిన తర్వాత మొదట్లో అంతా ఓకేగా ఉన్నా తర్వాత మాత్రం యాంటీ ఇంకెంబెన్సీ నెమ్మదిగా వచ్చింది. అది గుర్తించి సరిదిద్దుకునే సరికల్లా పుణ్యకాలం గడచింది టీడీపీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తొలి రెండేళ్ళు బాగానే ఉన్నట్లు అనిపించినా ఆ మీదట వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది సర్కార్ దానిని గుర్తించకపోవడంతో 2024 ఎన్నికలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
తొందరగా కనిపించినా :
ఇక చూస్తే 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మంచి మెజారిటీతో జనాలు పీఠం కట్టబెట్టారు. అయితే ఎన్నికల హామీలు నెరవేర్చలేదని మొదట్లో సర్కార్ మీద జనాలలో అసంతృప్తి కనిపించింది. కానీ రెండో ఏడాది వస్తూనే సూపర్ సిక్స్ హామీలను బాబు ఒక్కోటిగా నెరవేర్చడంతో ప్రభుత్వం పట్ల ఉన్న నెగిటివిటీని పాజిటివిటీగా మార్చగలిగారు అని అంటున్నారు. ఇంకా లోతుగా వెళ్ళి విశ్లేషించాలి అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం తొలి ఆరు నెలల పాటు జనాలు అంతా ఓపికగా చూశారు. ఆ తర్వాత మాత్రం నెగిటివిటీ మొదలైంది.
రెడ్ బుక్ తోనే అంతా :
ఇక రెడ్ బుక్ అమలు చేయడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వచ్చింది. ప్రతీ దాని విషయంలో రెడ్ బుక్ అని ప్రచారం జరగడం కూడా జనాలలో అసహనం పెంచింది. అయితే రెడ్ బుక్ మీద ప్రజలలో వ్యతిరేకతను కనిపెట్టిన చంద్రబాబు దానిని పక్కన పెట్టి పాలన మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఒక వైపు సూపర్ సిక్స్ పధకాలు లేకపోవడం తో పాటు మరో వైపు ఈ కక్ష సాధింపు చర్యలు ఏమిటి అని జనాలలోనూ చర్చ సాగింది. సూపర్ సిక్స్ హామీలను కూడా ఇపుడు అమలు చేయడంతో జనాలు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
పాజిటివిటీ పెరిగింది అలా :
పాలనను ఒక వైపు సజావుగా చేసుకుంటూ ఇంకో వైపు ప్రజలకు అవసరమైన పధకాలను అందిస్తూ చంద్రబాబు జనాలకు చేరువ అవుతున్నారు అన్నది ఒక విశ్లేషణగా ఉంది. దాంతో మొదటి ఏడాదిలో కనిపించిన వ్యతిరేకత కాస్తా ఇపుడు బాగా తగ్గిందని మేధావులు నుంచి కూడా సానుకూలమైన స్పందన వస్తోంది. బాబు చెప్పినది చేయరు అని ఊదరగొట్టే అవకాశం అసలు ఇవ్వకుండా ఎంత కష్టం అయినా పధకాలను బాబు ఇస్తూ రావడంతో ప్రజల నుంచి కూడా అదే స్థాయిలో అనుకూల వైఖరి కనిపిస్తోంది.స్తోంది అని అంటున్నారు.
లోకేష్ పాత్ర కీలకంగా :
చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన తన తీరుని మార్చుకున్నారు. ఒకపుడు మీడియా ముందుకు వస్తే చాలు ఆయన తప్పులు మాట్లాడేవారు అవి కాస్తా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతూండేవి. ఎపుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి లోకేష్ బాగా రాటు తేలారు. జాతీయ మీడియా దగ్గరతో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటుగా బాగా రాణిస్తూ వచ్చారని అంటున్నారు. ఇపుడు చూస్తే లోకేష్ జాతీయ మీడియాను చాలా డేరింగ్ గా ఫేస్ చేస్తున్నారు అన్న భావన ఉంది. వారు ఎంతటి క్లిష్టమైన ప్రశ్నలు అడిగినా తడుముకోకుండా జవాబు చెప్పడంలో లోకేష్ నేర్పు సాధించారు అని అంటున్నారు. ఢిల్లీలో ఈ మధ్యకాలంలో అనేక సార్లు లోకేష్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలే అందుకు నిదర్శనం అని అంటున్నారు. ఇక రెడ్ బుక్ ని ఈ మధ్య కాలంలో లోకేష్ పెద్దగా చర్చించడం లేదు, జాతీయ మీడియాలోనూ ఆ టాపిక్ అయితే అసలు రావడం లేదు అని గుర్తు చేస్తున్నారు. అలా రెడ్ బుక్ వేడిని తగ్గించి పాలనను సక్రమంగా చేస్తూ సంక్షేమం అభివృద్ధి మీదనే కూటమి ప్రభుత్వం గురి పెట్టడంతో చంద్రబాబు పాలన మీద జనాలలో ఇపుడు పూర్తి అనుకూలత కనిపిస్తోంది అని అంటున్నారు.
ఎమ్మెల్యేలు మాత్రం :
అయితే చంద్రబాబు దీక్షా దక్షతల మీద ఆయన పనితీరు మీద ఆయన సమర్ధత మీద జనాలలో మంచి అభిప్రాయం ఉంది, బాగానే మార్కులు పడుతున్నాయి కానీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఇంకా వ్యతిరేకత బాగానే ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేల అవినీతి విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద చంద్రబాబు లోకేష్ ఇద్దరూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది అని అంటున్నారు. ఎమ్మెల్యేల అవినీతిని బాగా తగ్గించినట్లు అయితే కూటమి ప్రభుత్వానికి ఎదురు ఉండదన్న భావన సర్వత్రా వ్యక్తం కావడం గమనార్హం. అంతే కాదు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుందని అంటున్నారు.
దూరంగా జగన్ :
ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే వైఎస్ జగన్ ప్రజల దగ్గరకు పెద్దగా పోవడం లేదు, ఆయన తన పరామర్శలను కూడా ఆపేసుకున్నారు. తాడేపల్లిలో పార్టీ సమావేశాలు సైతం గతంలోలా జరగడం లేదు, జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు అని అంటున్నారు. దీంతో పాటు అసెంబ్లీకి కూడా వైసీపీ వెళ్ళడం లేదు. ఈ విధంగా విపక్షం తనకు తాను స్వీయ నిర్బంధం విధించుకున్నట్లుగా పార్టీ తన యాక్టివిటీస్ ని తానుగానే తగ్గించుకుంటోంది అని అంటున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు పెద్దగా పని ఉండటం లేదు అని అంటున్నారు. పధకాలను అమలు చేస్తున్నారు. అదే విధంగా పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులను తెర మీదకు తెస్తున్నారు. దాంతో సోషల్ మీడియా వేదికగా వైసీపీ పోస్టులు పెట్టాలన్న సరైన సబ్జెక్ట్ అయితే దొరకడం లేదని అంటున్నారు. దాని కంటే ముందు కూటమి ప్రభుత్వం ఆ చాన్స్ కూడా ఇవ్వడం లేదు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక అన్ని విధాలుగా కూటమి సర్కార్ గత పదిహేను నెలల వ్యవధిలో తన అనుకూలతలను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది అని అంటున్నారు.