ఏపీలో 'స్థానికం' సెగ‌.. ఎవ‌రికి వారేనా... ?

రాష్ట్రంలో మరో నాలుగు మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది.;

Update: 2025-09-21 21:30 GMT

రాష్ట్రంలో మరో నాలుగు మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. స్థానిక సంస్థల్లో సహజంగా పార్టీల తరఫున, జండాల వారీగా ఎన్నికలు జరగకపోయినా మద్దతు దారులుగా అభ్యర్థులు పోటీకి దిగుతారు. పంచాయతీ సర్పంచులుగా.. అదేవిధంగా వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేస్తారు. గ్రామీణ స్థాయిలో జనసేన, టిడిపి బలంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జనసేన కన్నా టిడిపి బలంగా ఉంది. దీంతో ఎవరికి వారే పోటీ చేస్తారు అనే చర్చ తర‌మీదకు వచ్చింది. వాస్తవానికి కూటమిగా ఉన్న నాయకులు కూటమిగానే ఎన్నికలకు వెళ్లాలి.

కూటమిగానే అభ్యర్థులను కూడా ఎంపిక చేయాలి. పార్టీల వారీగా ఎన్నికలు జరగకపోయినా పార్టీ మద్దతుదారులుగా రంగంలోకి దిగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవడమే సమంజసం. కానీ, దీనికి భిన్నంగా ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య కూడా చీలిక ఏర్పడుతోంది. గ్రామీణ స్థాయిలో తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి తమకు లాభిస్తుందని భావిస్తున్న జనసేన సొంతంగా పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. ఇది ప్రస్తుతం అంతర్గతంగానే ఉన్న విషయం.

అయినప్పటికీ తీవ్రస్థాయిలో పార్టీని ప్రభావితం చేస్తోంది. ఇక టిడిపి బలంగా ఉన్నచోట సూపర్ సిక్స్ హామీలను చెబుతూ ఆ పార్టీ వర్గాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. అంటే ప్రధానంగా చెప్పాలంటే ఇరు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో చీలిక అయితే ప్రారంభం అయింది. వాస్తవానికి గ్రామీణ స్థాయిలో ఉండే రాజకీయాలకు నగర పట్టణ స్థాయిలో ఉండే రాజకీయాలకు చాలా తేడాలు ఉంటాయి. పట్టణ నగరాల స్థాయిలో నాయకులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కాస్త కలిసిమెలిసి ఉండటం అనేది తెలిసిందే.

కానీ గ్రామీణ స్థాయిలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా రాజకీయాలు చేస్తారు. అది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అంశం కావడంతో ఎవరూ దానిని వ్యతిరేకించే పరిస్థితి లేదు. దీంతో జనసేనకు మద్దతు తెలిపే వర్గాలు ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు, రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.. తప్ప కలివిడిగా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో స్థానిక సంస్థల్లో ఈ ద‌ఫా ఈ రెండు పార్టీల మధ్య చీలిక కనిపించే అవకాశం స్పష్టంగా ఉందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో పెద్దగా బలం లేకపోవడం.. ఈ రెండు పార్టీల మధ్య ఆధారపడి ఉన్న నేపథ్యంలో బిజెపి ప్రభావం చూపించే అవకాశం లేదు.

అయినప్పటికీ బీజేపీ చీఫ్ మాధవ్ కొంతమేరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని పుంజుకునేలా చేసేందుకు తనవంతు కృషి కూడా చేస్తున్నారు. దీంతో బిజెపి నాయకులు కూడా ఆ పార్టీ మద్దతు దారులుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కూడా గడవకుండానే క్షేత్రస్థాయిలో ఎన్నికలు అనగానే చీలికలు రావడం ఎవరికి వారుగా పోటీకి సిద్ధం కావడం వంటివి ఆయా పార్టీల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది పై స్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి కూడా ఉండదు.

ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు వాస్తవానికి అసలు పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఆయన మాటను ఎవరూ లెక్క చేయకుండానే పోటీకి దిగారు. గెలిచిన చోట గెలిచారు. ఓడిన చోట ఓడారు. అలానే, ఇప్పుడు కూడా గ్రామీణ స్థాయిలో ఎవరికి వారుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించే పవన్ కళ్యాణ్ దసరా తర్వాత జిల్లాల పర్యటన అదే విధంగా గ్రామీణ స్థాయి పర్యటన పెట్టుకున్నారు. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది. ఏ మేరకు కూటమిని ఐక్యంగా ఉంచే ప్రయత్నం చేస్తారు అనేది చూడాలి.

Tags:    

Similar News