అరడజన్ మేయర్లు మిత్ర పక్షాలకేనా...16న తొలి సిటింగ్ ?
దాంతో కూటమి పార్టీల మధ్య మొదటి మీటింగ్ ఈ నెల 16న జరుగుతుంది అని అంటున్నారు. ఈ భేటీలో టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ పాల్గొంటారని భోగట్టా.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 3 లేదా 4వ తేదీన కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పాలికలకు సంబంధించిన ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కూటమిలో కూడా వేడి పుడుతోంది. ఇప్పటిదాకా మూడు పార్టీల అధినేతల భేటీ అయితే జరగలేదు. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేరళంలో ప్రకృతి వైద్యం తీసుకుంటున్నారు. ఆయన త్వరలో ఏపీకి వస్తున్నారు అని అంటున్నారు. దాంతో కూటమి పార్టీల మధ్య మొదటి మీటింగ్ ఈ నెల 16న జరుగుతుంది అని అంటున్నారు. ఈ భేటీలో టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ పాల్గొంటారని భోగట్టా.
ఎక్కువ సీట్లు కోసం :
ఈ భేటీ అయితే రాజకీయంగా కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో మాదిరిగా ఈసారి పొత్తులు సాఫీగా కుదురుతాయా అన్నదే చూడాలని అంటున్నారు. కొత్త ఫార్ములాతో 30 శాతం సీట్లు కావాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఇక బీజేపీ విషయం తీసుకుంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది అసెంబ్లీ సీట్లలొ ఆత్యధికం స్థానిక సీట్లు తమకే కేటాయించాలని పట్టుబడుతోంది. అంతే కాదు కీలకమైన మేయర్లు జెడ్పీ పీఠాలలో కూడా తగిన వాటా కావాలని కోరనుంది అంటున్నారు. దీంతో పాటు మునిసిపల్ చైర్మన్ పోస్టులలో కూడా బీజేపీ జనసేన తమ వాటాను డిమాండ్ చేయనున్నాయి. దాంతో ఈ భేటీలో ఏమి జరుగుతుంది అన్నదే అంతా నిశితంగా చూస్తున్నారు.
కీలక మేయర్ పీఠాలతో :
ఇక మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. విశాఖ రాజమండ్రి మేయర్ పీఠాలను తమ పార్టీకి కేటాయించాలని బీజేపీ కోరనుంది అంటున్నారు. అలాగే విజయవాడ,తిరుపతి, కాకినాడ, ఒంగోలు కార్పోరేషన్ మేయర్ పీఠాలు తమకు వదిలేయాలని జనసేన నుంచి డిమాండ్ వస్తోంది. అంటే ఏపీలో మూడు కీలక ప్రాంతాలలో ఉన్న మూడు ముఖ్యమైన కార్పోరేషన్లు మిత్ర పక్షాలకే ఇస్తే పెద్ద పార్టీ అయితే టీడీపీ సంగతి ఏమిటి అన్నది కూడా ఉంది. ఏపీలో విశాఖ పెద్దది, ఆ తరువాత విజయవాడ ఉంది, తిరుపతి కూడా కీలకంగా ఉంది. దాంతో ఈ మూడూ మిత్రులు కోరితే టీడీపీ ఇస్తుందా అన్నది కూడా సందేహంగా ఉంది.
మూడు పార్టీలలోనూ :
స్థానిక సంస్థలలో తమ క్యాడర్ ని కాపాడుకోవాలని మిత్ర పక్షాలు చెబుతూంటే టీడీపీది అదే సమస్య కదా అని అంటున్నారు. ఇప్పటికే తాము 2024 ఎన్నికల్లో సీట్లు త్యాగాలు చేశామని ఇపుడైనా తమకు చాన్స్ ఇవ్వకపోతే ఎలా అన్నది టీడీపీ తమ్ముళ్ల మాటగా ఉంది. పైగా తమకు బలం ఉంది అని మిత్రులు అనవచ్చు కానీ వారి కంటే ఎక్కువ బలం క్షేత్ర స్థాయిలో టీడీపీకి ఉంది కదా అని గుర్తు చేస్తున్నారు దాంతో ఈ సీట్ల పంచాయతీ ఎలా ఒక కొలిక్కి వస్తుంది అన్నది మాత్రం చూడాలనే అంటున్నారు.
జెడ్పీ పీఠాలు సైతం :
మరో వైపు చూస్తే జనసేన 21 సీట్లలో గెలిచింది. బీజేపీ 8 సీట్లలో గెలిచింది. అలా ముప్పయి దాకా అసెంబ్లీ నియోజకవర్గాలలో మిత్ర పక్షాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికే వదిలేయాలంటే దానికి తమ్ముళ్ళు ససరేమిరా అంటారని చెబుతున్నారు. అదే విధంగా జనసేన అయితే గోదవారి జిల్లాలలో రెండు జెడ్పీ పీఠాలు,. అలాగే ఉత్తరాంధ్రాలో ఒకటి, తిరుపతి అన్నమయ్య జిల్లాలలో మరో రెండూ వంతున కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు తమకు సైతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
ఐక్యతతోనే అంతా :
అయితే ఎవరికి ఎన్ని సీట్లు అన్నది ఒక ఎత్తు అయితే అంతా కలసి 2024 నాటి ఐక్యతను కొనసాగించాలన్నదే ప్రధాన అజెండాగా చేసుకుని ఈ చర్చలు సాగుతాయని అంటున్నారు. ఆ విధంగా విశాలమైన ప్రయోజనాల కోసం ఆలోచిస్తేనే తప్ప సీట్ల తకరారుకు సరైన పరిష్కారం దక్కదని అంటున్నారు.