సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి.. లిక్కర్ స్కాం ఈ ముగ్గురికే పరిమితమా?
ఏపీ లిక్కర్ స్కాం.. ఇప్పుడు ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా దీనికోసమే చర్చించుకుంటున్నారు.;
ఏపీ లిక్కర్ స్కాం.. ఇప్పుడు ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా దీనికోసమే చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీఐడీతో విచారణ జరిపించిన ప్రభుత్వం అనంతరం దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించింది. అయితే గత ప్రభుత్వంలో కీలక నేతలకు ఈ స్కాంతో సంబంధం ఉందని టీడీపీ ఆరోపణలు చేసినా, ప్రస్తుతం వైసీపీలోని ముగ్గురు నేతలు చుట్టూనే విచారణ సాగుతోంది. దీంతో మద్యం స్కాంలో ఆ ముగ్గురి పాత్ర? ఏంటన్న చర్చ మరింత ఆసక్తి రేపుతోంది.
ఒకప్పుడు వైసీపీలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ప్రస్తుత రాజంపేట ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు పి.మిథున్ రెడ్డి, మాజీ సీఎం జగన్ దూరపు బంధవు రాజ్ కసిరెడ్డిపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తోంది ప్రభుత్వం. ఈ కేసుతో తనకు సంబంధం లేదని సాక్షిగా మాత్రమే తనను విచారణకు రమ్మన్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అంతేకాకుండా ఈ స్కాంతో నేరుగా లింకు ఉందని వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి పేరును ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి పాత్రపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు విజయసాయిరెడ్డి.
మరోవైపు ఈ కేసులో విచారణకు రమ్మంటూ నాలుగు నోటీసులు ఇచ్చినా మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి మాత్రం ఉలకుపలుకు లేకుండా తిరుగుతున్నారు. అదేసమయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు రక్షణతో విచారణను ఎదుర్కొన్నారు. ఐతే ఈ కేసులో ఈ ముగ్గురినే ఎందుకు ప్రశ్నిస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది. పార్లమెంటు సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? లిక్కర్ పాలసీ చేయాల్సింది సంబంధిత మంత్రి, అధికారులు, ముఖ్యమంత్రి కదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి సైతం ఇవే ప్రశ్నలు లేవనెత్తుతున్నారని చెబుతున్నారు. కానీ, అప్పట్లో ఎంపీగా పనిచేసిన విజయసాయిరెడ్డి మాత్రం తన ఇంట్లో లిక్కర్ పాలసీ మీటింగు రెండు సార్లు నిర్వహించారని, దానికి మిథున్ రెడ్డి వచ్చారని చెప్పడంతో ఆయన ఇరుక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు ఎలా పరిగణిస్తారనేది ఆసక్తి రేపుతోంది. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కలిసి లిక్కర్ వ్యాపారం చేశారని, అందుకు తాను రూ.100 కోట్లు అప్పుగా ఇప్పించానని కూడా సాయిరెడ్డి చెప్పడంతో ఆ ఇద్దరూ కష్టాల్లో కూరుకుపోయినట్లేనని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో సాయిరెడ్డి పాత్ర ఏంటి? నిజంగా రెండు సమావేశాల తర్వాత ఆయనను దూరం పెట్టారా? అనేది సిట్ అధికారులే తేల్చాల్సివుందని అంటున్నారు.
అంతేకాకుండా లిక్కర్ స్కాంలో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు నాయకులు కాకుండా ఇంకా ఎవరినైనా ప్రశ్నిస్తారా? లేదా? అనేది కూడా ఆసక్తి రేపుతోంది. స్కాంలో అంతిమ ప్రయోజనం పొందింది బిగ్ బాస్ అనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదని సాయిరెడ్డి చెబుతుండగా, సిట్ కూడా బిగ్ బాస్ పై అనుమానాలు ఉన్నాయని, బిగ్ బాస్ పాత్రపై ఆధారాలు సేకరించామని ఇంతవరకు చెప్పలేదు. దీంతో లిక్కర్ పాలసీ దర్యాప్తు ఇంకా ముందుకు వెళుతుందా? ఈ ముగ్గురి విచారణతో ముగుస్తుందా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.