‘బిగ్ బాస్’ పాత్రపై స్పష్టమైన ఆధారాలు.. రెండో చార్జిషీటులో సంచలన విషయాలు

ఏపీ మద్యం స్కాంపై దర్యాప్తు చేస్తున్న సిట్ సోమవారం ఏసీబీ కోర్టులో రెండో చార్జిషీటు దాఖలు చేసింది.;

Update: 2025-08-11 12:57 GMT

ఏపీ మద్యం స్కాంపై దర్యాప్తు చేస్తున్న సిట్ సోమవారం ఏసీబీ కోర్టులో రెండో చార్జిషీటు దాఖలు చేసింది. గత నెలలో ప్రైమరీ చార్జిషీటును సమర్పించిన సిట్ తాజాగా రెండో చార్జిషీటును కోర్టుకు అందజేసింది. ఇందులో కీలక నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్రపై పూర్తి వివరాలను నివేదించింది. అంతేకాకుండా అంతిమ లబ్దిదారుగా చెబుతున్న ‘బిగ్ బాస్’ పాత్రపైనా ప్రస్తావన తీసుకువచ్చింది. స్కాంపై దర్యాప్తు కొనసాగుతోందని మరో చార్జిషీటు దాఖలు చేస్తామని సిట్ అధికారులు వెల్లడించారు.

నాటి ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలోనే మద్యం స్కాం జరగిందని సిట్ ఆరోపణలు చేసింది. సుమారు 200 పేజీలతో తయారు చేసిన చార్జిషీటులో అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కాల్ డేటా రికార్డులను గూగుల్ టేక్ అవుట్ సమాచారం, ల్యాప్ టాప్ లో భద్రపరిచిన వివరాలను చార్జిషీటులో సిట్ అధికారులు వెల్లడించారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకే మద్యం విధానంలో మార్పులు చేశారని, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారాల్లో నిందితులు ముగ్గురి పాత్ర ఉందని తేల్చిచెప్పింది. ముడుపులను ఎలా సేకరించాలి? ఎక్కడ దాచాలి, నల్లధనాన్ని చలామణీలోకి తేవడం ఎలా వంటి విషయాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు, సలహాలిచ్చినట్లు సిట్ ఆరోపణలు చేసింది.

మద్యం విధానం రూపకల్పనలో ధనుంజయరెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని చార్జిషీటులో పొందుపరిచిందని చెబుతున్నారు. మద్యం ముడుపులు ఎవరి నుంచి ఎంత తీసుకున్నారన్న విషయాలను కూడా ధనుంజయరెడ్డి పర్యవేక్షించేవారని సిట్ నివేదికలో ప్రస్తావించింది. కేసులో సహ నిందితులైన విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో మిగిలిన ముగ్గురు నిందితులు తరచూ ఫోన్ మాట్లాడిన వివరాలను కూడా సేకరించినట్లు సిట్ అధికారులు చెప్పారు. అంతేకాకుండా లిక్కర్ సిండికేట్ సమావేశాలకు ధనుంజయరెడ్డి పలుమార్లు హాజరైనట్లు గూగుట్ టేకవుట్ సమాచారం ఆధారంగా నిర్ధారించినట్లు సిట్ అధికారులు చార్జిషీటులో తెలిపారు. కమీషన్ గా వసూలు చేసిన డబ్బులో కొంత మొత్తం ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వెనకేసుకున్నట్లు సిట్ చార్జిషీటులో వివరించింది. ఈ మొత్తాన్ని బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టారని వాటికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.

గత నెల 19న 305 పేజీలతో తొలి చార్జిషీటు దాఖలు చేసిన సిట్ ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ద్వారా ముడుపులు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేరాయని ఆరోపించింది. ఇప్పుడు రెండో చార్జిషీటులో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి నుంచి బాలాజీ గోవిందప్ప ద్వారా బిగ్ బాస్ కు చేరినట్లు సిట్ స్పష్టం చేసింది. దీంతో సిట్ తదుపురి చర్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మద్యం కేసులో అంతిమ లబ్దిదారుగా భావిస్తున్న బిగ్ బాస్, మాజీ సీఎం జగన్ ను విచారణకు పిలుస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News