వచ్చే 24 గంటలు అత్యంత కీలకం..? ఎందుకంటే..

ఏపీ మద్యం స్కాంలో వచ్చే 24 గంటలు అత్యంత కీలకంగా చెబుతున్నారు.;

Update: 2025-05-12 09:54 GMT

మద్యం స్కాంలో కీలకమైన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు మూడు రాష్ట్రాల్లో జల్లెడపడుతున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు గత ప్రభుత్వంలో సీఎంవోనే నడిపిన అధికారులు కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. నిందితుల అరెస్టే లక్ష్యంగా పోలీసులు సోదాలు చేయడం, ఎక్కడా వారి ఆచూకీ తెలియకుండా నిందితులు జాగ్రత్త పడటంతో అనుక్షణం టెన్షన్.. టెన్షన్ గా మారిందంటున్నారు.

ఏపీ మద్యం స్కాంలో వచ్చే 24 గంటలు అత్యంత కీలకంగా చెబుతున్నారు. స్కాంలో ఏ31, ఏ32, ఏ33గా అభియోగాలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి క్రిష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లు 13వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఇప్పటికే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వారు పెట్టుకున్న పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఒక్కటే నిందితులకు ఉపశమనం కల్పించే అవకాశం ఉందంటున్నారు. దీంతో ముందస్తు బెయిల్ పై సుప్రీం నిర్ణయం వెలువడే వరకు పోలీసులకు చిక్కకుండా ఉండేలా నిందితులు తప్పించుకుతిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ముందస్తు బెయిల్ పై విచారణ మొదలవ్వకముందే ముగ్గురు నిందితులను అరెస్టు చేయాలని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు పావులు కదుపుతున్నారు. మద్యం స్కాంలో ఈ ముగ్గురి పాత్ర అత్యంత కీలకంగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మద్యం డిస్టలరీల నుంచి వసూలు చేసిన కమీషన్లు ఈ ముగ్గురు ద్వారానే బిగ్ బాస్ కి చేరవేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో వీరిని అరెస్టు చేసి బిగ్ బాస్ కి చెక్ చెప్పేలా ప్రభుత్వం వ్యూహం పన్నిందని అంటున్నారు. వీరి అరెస్టుతో బిగ్ బాస్ ని ఇరుకున పెట్టే అవకాశాలు ఉండటంతో సిట్ కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో సీఎంవోలో అన్నీ తానై వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, అప్పటి సీఎం ఓఎస్డీగా పనిచేసిన క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ద్వారానే కమీషన్లు అంతిమ లబ్ధిదారుకు చేరేవని చెబుతున్న ప్రభుత్వానికి ఈ ముగ్గురి అరెస్టు ప్రతిష్ఠాత్మకంగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి అరెస్టు భయంతో తప్పించుకుతిరుగుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ అధికారిగా పనిచేసిన ధనుంజయరెడ్డి విచారణను ఎదుర్కుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిట్ నోటీసులకు స్పందించకుండా, విచారణకు గైర్హాజరు కావడం తప్పుడు సంకేతాలను పంపినట్లైందని అంటున్నారు.

మరోవైపు ధనుంజయ్ రెడ్డి అండ్ టీం అరెస్టు కోసం సిట్ పకడ్బందీగా పావులు కదుపుతోంది. వారిని అరెస్టు చేస్తే మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతోందనే అంచనాతో ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం కోర్టు తెరిచే సమయానికి అరెస్టు చేయాలని సిట్ అధికారులు స్కెచ్ వేస్తున్నారు. ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నిందితుల కోసం సోదాలు చేస్తున్నారు. అయితే ఎక్కడా చిన్న క్లూ కూడా లభించకపోవడంతో పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదంటున్నారు. మొత్తానికి మంగళవారం సుప్రీంకోర్టు తెరిచే సమయానికి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News