జయలలిత నెచ్చెలి.. శశికళ కొత్త పార్టీ.. వెనుక స్టాలిన్?!
తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ప్రాణ స్నేహితురాలు.. శశికళ కొత్త పార్టీని ప్రకటించారు.;
తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ప్రాణ స్నేహితురాలు.. శశికళ కొత్త పార్టీని ప్రకటించారు. మంగళవారం జయలలిత జయంతిని పురస్కరించుకు ని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను త్వరలోనే పార్టీని పెట్టనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన జెండాను ఆమె ఆవిష్కరించారు. కొత్త రాజకీయ చరిత్రను మనం చూడబోతున్నామని, కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నామని శశికళ వ్యాఖ్యానించారు.
జయలలిత ఫొటోతో..
మాజీ సీఎం జయలలిత ఫొటో సహా.. ద్రవిడ ఉద్యమ రూపశిల్పి అన్నాదురై, మాజీ సీఎం ఎంజీఆర్‌ల ఫొటోలతో కూడిన పార్టీ జెండాను శశికళ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జెండాలో నలుపు, తెలుపు, ఎరుపు రంగులను జోడించారు. తమిళనాడులో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు నలుపు, తమిళనాడు అభివృద్ధిని కాంక్షిస్తూ.. తెలుపు, కార్మికుల పక్షాన పోరాడేందుకు, వారి హక్కులు నిలబెట్టేందుకు ఎరుపు రంగును ఎంచుకున్నట్టు శశికళ తెలిపారు. పార్టీ పేరును త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
తెరవెనుక స్టాలిన్..?
కాగా.. శశికళ కొత్త పార్టీ వెనుక అధికార డీఎంకే నేత, సీఎం స్టాలిన్ ఉన్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో అనూహ్యంగా శశికళ కొత్త పార్టీ పెట్టడం వెనుక అనేక చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుత అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను గతంలోనే బహిష్కరించారు. దీంతో ఆమెకు ఏ పార్టీ కూడా ఆశ్రయం కల్పించలేదు. ఇక, అమ్మ సెంటిమెంటుతో అన్నాడీఎంకే నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అదే సెంటిమెంటుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశంతోనే శశికళను రాజకీయంగా అధికార పార్టీ ప్రోత్సహిస్తోందన్న చర్చసాగుతోంది.
సక్సెస్ అయ్యేనా?
ఇక, శశికళ రాజకీయాలను పరిశీలిస్తే.. ఆమె ఎప్పుడూ.. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసింది లేదు. జయలలిత జీవించి ఉన్న రోజుల్లో ఆమె నెచ్చెలిగా మాత్రమే వ్యవహరించారు. ఆమె మరణం తర్వాత.. అన్నాడీఎంకేను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించినా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనూహ్యంగా ఆమె జైలు పాలయ్యారు. అనంతరం.. బయటకు వచ్చాక కూడా మౌనంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుని ప్రజల మధ్యకు వెళ్లినా.. ఏమేరకు ఆమెను ప్రజలు స్వాగతిస్తారన్నది ప్రశ్న. జయలలిత లెగసీని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆమేరకు ప్రజలను కదిలించే శక్తి శశికళకు లేదని పరిశీలకులు చెబుతున్నారు.