తొలి ప్రధానిగా పటేల్...ఆర్ఎస్ఎస్ సంచలనం

ఈ దేశానికి తొలి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాల్సింది అని ఆర్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేసింది.;

Update: 2026-02-25 16:50 GMT

ఈ దేశానికి తొలి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాల్సింది అని ఆర్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ వందేళ్ళ పండుగను దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. తాజాగా తెలంగాణా రాష్ట్రం కరీంనగర్ లో నిర్వహించిన సభలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ వారణాసి రామ్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ ఎస్ ఎస్ వందేళ్ల చరిత్ర. ఎదుర్కొన్న ఇబ్బందులు దేశంలో స్వాతంత్ర్యం ముందూ తరువాత ఆర్ఎస్ఎస్ మీద జరిగిన రాజకీయ దాడులు నిషేషం గాంధీ హత్య వంటి వాటి గురించి విపులంగా వివరించారు.

పటేల్ కే మొగ్గు :

ఇక దేశానికి తొలి ప్రధానిగా పటేల్ కావాల్సింది అని చరిత్రలో ఉన్న విషయాలను ఆయన వివరించారు. 1946లో ఆనాటికి ఉన్న మొత్తం 15 రాష్ట్రాల పీసీసీ కమిటీలలో 12 పటేల్ ని తొలి ప్రధానిగా ఉండాలని ఓటు చేశాయని అన్నారు. మిగిలిన మూడు కమిటీలు ఏ నిర్ణయం చెప్పలేదని అన్నారు. ఆ తరువాత గాంధీజీ జోక్యం చేసుకుని నెహ్రూని ప్రధానిగా పటేల్ ని ఉప ప్రధానిగా ఒక మధ్యేమార్గాన్ని రూపొందించారు అని రామ్ మాధవ్ చెప్పుకొచ్చారు.

.ఆర్ఎస్ఎస్ మీద రుద్దారు :

ఆనాడు కూడా కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉండేవని ఒకటి నెహ్రూ వర్గం అయితే రెండవది పటేల్ వర్గం అని రామ్ మాధవ్ చెప్పారు. పటేల్ .ఆర్ఎస్ఎస్ వైపు ఉన్నారని నెహ్రూ అనుమానం అని రామ్ మాధవ్ చెప్పుకొచ్చారు. ఇక 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్య జరిగిందని అయితే హత్య చేసిన వారితో ఏ మాత్రం ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేకపోయినా దానిని సంఘం మీద రుద్దే ప్రయత్నం ఆనాటి నెహ్రూ ప్రభుత్వం చేసింది అని ఆయన అన్నారు. హత్య జరిగిన నాలుగు రోజుల తేడాలో అంటే 1948 ఫిబ్రవరి 4న కేబినెట్ మీటింగ్ పెట్టి మరీ నెహ్రూ ఆర్ఎస్ఎస్ ని నిషేధించారని అన్నారు. ఇక హోం మంత్రిగా నాడు ఉన్న పటేల్ అదే నెల 26న నెహ్రూకి ఒక లేఖ రాస్తూ తాను గాంధీ హత్య కేసుని పూర్తిగా పరిశీలిస్తున్నాను అని ఇందులో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. అంతే కాదు కోర్టులు సైతం ఇదే విషయం చెప్పాయని రామ్ మాధవ్ గుర్తు చేశారు. అయినా సరే ఆర్ఎస్ఎస్ ఎదగకూడదు అన్న ఉద్దేశ్యంతో నాటి నెహ్రూ ప్రభుత్వం నిర్బంధాలను విధిస్తూ వచ్చిందని అన్నారు.

అదే నెహ్రూ ఆహ్వానం :

ఇదిలా ఉంటే ఏ నెహ్రూ అయితే ఆర్ఎస్ఎస్ కి ఈ దేశంలో గజం జాగా కూడా ఇవ్వబోమని శపధం పట్టి చెప్పారో ఆయనే 1963 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పేరేడ్ కి ఆర్ఎస్ఎస్ ని కూడా ఆహ్వానించారు అని అన్నారు. సంఘ్ కార్యక్రమాలను ఆయన సైతం అర్ధం చేసుకున్నారని రామ్ మాధవ్ చెప్పారు. అంతే కాదు మొదట్లో ఆర్ ఎస్ ఎస్ ని పూర్తిగా వ్యతిరేకించిన లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ కూడా 1970 దశకంలో ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను కొనియాడారు అని అన్నారు. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ అతి పెద్ద ఆశ అని ఆయన చెప్పారని అన్నారు.

గాంధీ అంటే గౌరవం :

ఈ దేశంలో గొప్ప నేతగా ఉన్న మహాత్మా గాంధీ అంటే ఆర్ఎస్ఎస్ కి ఎంతో గౌరవం అని రామ్ మాధవ్ చెప్పారు. గాంధీ హత్య చేసిన వారిని ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడూ సమర్ధించలేదని గుర్తు చేశారు. అంతే కాదు గాంధీ జ్ఞాపకార్థం ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సంఘ్ ప్రభాత సమయంలో చేసే ప్రార్ధనా గీతంలో గాంధీజీ పేరుని కూడా చేర్చి మరీ ఆయనకు ప్రతీ రోజూ నివాళి అర్పిస్తుందని రామ్ మాధవ్ కొత్త విషయం చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో అత్యంత బలమైన స్థానంలో ఉందని వందేళ్ళ తరువాత కూడా మరింతగా విస్తరిస్తున్న ఏకైక సంస్థ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమే అని ఆయన అన్నారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరం :

ఆర్ఎస్ఎస్ ఎపుడూ దేశం క్షేమం కోరుకుందని ఉత్తమమైన నైతిక వర్తనంతో కూడిన సమాజాన్ని కోరుకుందని రామ్ మాధవ్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఎపుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేదని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు ఎన్నడూ కూడా రాజకీయాల జోలికి పోదని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News