ఏపీకి ఇదో శాపం: వీకెండ్ వస్తే అగ్రనేతలు హైదరాబాద్ కు!
సాయంత్రం వచ్చిందంటే.. వీకెండ్ పార్టీలకు.. లేదంటే వీకెండ్ ట్రిప్ లకు వెళ్లే పరిస్థితి. వారు హైదరాబాద్ లో ఉన్నా.. బెంగళూరులో ఉన్నా ఇలానే సాగుతుంటుంది.;
ఐటీ ఉద్యోగుల్లో చాలామంది సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు పని చేస్తారు. సాయంత్రం వచ్చిందంటే.. వీకెండ్ పార్టీలకు.. లేదంటే వీకెండ్ ట్రిప్ లకు వెళ్లే పరిస్థితి. వారు హైదరాబాద్ లో ఉన్నా.. బెంగళూరులో ఉన్నా ఇలానే సాగుతుంటుంది. అచ్చం ఐటీ ఉద్యోగుల మాదిరి కనిపిస్తోంది ఏపీ పాలకుల తీరు చూస్తుంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన కుమారుడు కం రాష్ట్ర మంత్రి లోకేశ్.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురు వీకెండ్ వేళ.. విజయవాడలో ఉండే కన్నా హైదరాబాద్ లో ఉంటున్నారన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ప్రభుత్వానికి అన్నీ తామైన వారు వీకెండ్ వేళ.. హైదరాబాద్ కు వెళ్లే బదులు.. వారి ఫ్యామిలీ మెంబర్లే విజయవాడ వచ్చేలా ఏర్పాటు ఎందుకు చేసుకోకూడదన్న మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి షెడ్యూల్ అంటే దాదాపుగా ప్రత్యేక విమానాన్ని వినియోగించాల్సిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ప్రత్యేక విమానాల్ని వినియోగించటం తెలిసిందే.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వీరి వీకెండ్ ట్రిప్స్ చిట్టా బయటకు తీస్తే.. ఇంతలా ప్రయాణించారా? అని అనుకోకుండా ఉండలేరు. వీకెండ్ తో పాటు.. విడిగా పలు సందర్భాల్లో హైదరాబాద్ కు వెళ్లిన లెక్కల చిట్టాను ఓపెన్ చేస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘హైదరాబాద్’ కు వెళ్లే పెద్ద మనుషుల జాబితాలో ముందు ఉంటారు. ఏపీలో ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇప్పటివరకు ఆయన 104 సార్లు హైదరాబాద్ కు వెళ్లి రావటం జరిగింది.
ఆ తర్వాతి స్థానంలో ఏపీ మంత్రి లోకేశ్ నిలుస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు లోకేశ్ 83 సార్లు హైదరాబాద్ వెళ్లి వచ్చారు. మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలుస్తారు. సీఎం అయ్యాక ఇప్పటివరకు ఆయన గన్నవరం నుంచి హైదరాబాద్ కు 80 సార్లు ప్రయాణించారు. ఈ ముగ్గురు తమ హైదరాబాద్ పర్యటనకు ఎక్కువగా ప్రత్యేక విమానాల్ని వినియోగిస్తుంటారు.
ఏపీ ముఖ్యమంత్రి అయ్యే వారెవరైనా సరే.. వీక్ లోనూ.. వీకెండ్ లోనూ విజయవాడలోనే ఉంటామన్న హామీ ఇచ్చే వారినే ఎన్నుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో త్వరలోనే వస్తుందంటున్నారు. వీకెండ్ వేళ వేరే ప్రాంతాలకు వెళ్లొద్దని కాదు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వారం మొత్తం పని చేసినా చేయాల్సిన పనులు.. చేపట్టాల్సిన సమావేశాలు బోలెడు ఉంటాయి. అలా అని ఆదివారాల్లో పని చేయాలని చెప్పట్లేదు. కానీ.. వీలైనంతగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ముఖ్యనేతలు ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుటుంబాలు హైదరాబాద్ లో పాలకులు విజయవాడలో ఉన్నంత కాలం షటిల్ సర్వీసు మాదిరి పక్క రాష్ట్రానికి వెళ్లి రావటం తప్పదని చెప్పాలి.