ఏపీలో హనీమూన్ ఓవర్.. పనులు మొదలు పెట్టాల్సిందే!
కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ ముగిసిపోయింది. వాస్తవానికి సీఎం చంద్రబాబు కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానీ.. ఇలా అనుకోవడం లేదు;
కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ ముగిసిపోయింది. వాస్తవానికి సీఎం చంద్రబాబు కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానీ.. ఇలా అనుకోవడం లేదు. వారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే పనులు ప్రారంభించారు. ప్రజల మధ్యకు వచ్చారు. తొలి రోజు నుంచే పక్కా ప్రణాళికలతో ప్రభుత్వ పాలనను ప్రారంభించారు. తొలి వారంలోనే సీఎం చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనులు ఎక్కడ ఆగాయో తెలుసుకున్నారు. అదేవిధంగా అమరావతిలోనూ పర్యటించారు.
ఇక, పవన్ కల్యాణ్ కూడా.. తొలివారంలోనే తన తన శాఖలపై అవగాహన పెంచుకున్నారు. తొలి వారం రోజులు ఆయన తన కార్యాలయాన్ని స్కూల్‌గా మార్చుకున్నారు. ఇలా.. వారి విషయంలో హనీమూన్ పిరియడ్ లేదనే చెప్పాలి. కానీ.. ఇతర ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. మాత్రం తేడా కొడుతోంది. ఏడాది కాలంలో ఎవరు ఏం చేశారంటే.. కొందరు తమకు నిధులు లేవని.. అందుకే ప్రజల మధ్యకు రాలేక పోతున్నామని చెబుతున్నారు. ఇది ఎంత వరకు కరెక్టో వారే ఆలోచించుకోవాలి.
ఎందుకంటే.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. నియోజకవర్గంలో పర్యటించి.. సమస్యలు రాసుకుని.. పరిష్కారం కోసం.. డిప్యూటీసీఎంను కలిసి తొలి రెండు మాసాల్లోనే. ఆయా సమస్యలను పరిష్కరించింది కూడా.. ఆరు మాసాల్లోనే. ఇక, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా.. తొలి నెలలోనే ప్రజలకు చేరువ అయ్యారు. వాస్తవానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాబట్టి.. ఆయనకు ఇబ్బంది లేదు. ఇక, ఇతర నాయకుల మాటేంటి? అనేది ప్రశ్న. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది? అంటే.. ప్రశ్నలే వస్తున్నాయి.
ఎవరోచెప్పాలి.. ఏదో చేయాలి.. అనే ధోరణిలోనే చాలా మంది నాయకులు ఉన్నారు. ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని అంటే.. మొక్కు బడిగా పాల్గొనడం.. రెండు మూడు రోజుల్లోనే వాటిని పూర్తి చేయడం.. షరా మామూలుగా మారింది. అలానే.. కొందరు ప్రజా దర్బార్ పెట్టినా.. వాటి సమస్యల పరిష్కారానికి చిత్త శుద్ధి ప్రదర్శించలేకపోయారు. మరోవైపు.. కూటమి నాయకుల్లో ఆధిపత్య ధోరణి కనిపించింది. సో.. కొన్ని తప్పులు.. ఒప్పులు స్పష్టంగా ఉన్నాయి. ఇక, ఇప్పుడు హనీమూన్ పిరియడ్ ముగిసింది. ఈ ఏడాది అత్యంత కీలకం. మరి ఇప్పటికైనా నిర్దేశిత కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతారో లేదో చూడాలి.