బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు.. హైకోర్టు కీలక ఆదేశాలు!
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు, బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అరెస్టుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.;
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు, బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అరెస్టుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బిహార్ హోంగార్డు విభాగం ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ గతంలో డిప్యుటేషన్ పై రాష్ట్రంలో సీఐడీ విభాగం డీఐజీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్పటి ఎంపీ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని ఫిర్యాదుపై సునీల్ నాయక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సునీల్ నాయక్ ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తుండగా, ఆయన ముందస్తు బెయిలు కోసం ప్రయత్నిస్తున్నారు.
గత సోమవారం బిహార్ రాజధాని పట్నాలో సునీల్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ సమయంలో నిబంధనలు పాటించలేదని అక్కడి కోర్టు ట్రాన్సిట్ వారెంటు జారీ చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా ఈ నెల 2వ తేదీ వరకు ట్రాన్సిట్ వారెంటుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతోపాటు సునీల్ నాయక్ మధ్యంతర బెయిలుపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే మధ్యంతర బెయిలు పిటిషన్ పై విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు, నిందితుడు సునీల్ నాయక్ పోలీసు విచారణకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రఘురామ కేసులో విచారణ నుంచి సునీల్ నాయక్ తప్పించుకుంటున్నారని, ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను దిగువకోర్టు కొట్టివేసిందని సిట్ తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. న్యాయవాదుల వాదనల అనంతరం సునీల్ నాయక్ ఈ నెల 5 లేదా అంతకంటే ముందు పోలీసుల ఎదుట హాజరుకావాలని, పోలీసులకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సునీల్ నాయక్ విచారణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐజీ సునీల్ నాయక్ గుంటూరులో సిట్ విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
హైకోర్టు ఆదేశాలతో ఐజీ సునీల్ నాయక్ కు అరెస్టు ముప్పు తాత్కాలికంగా తప్పినట్లే అంటున్నారు. అయితే ఆయన విచారణకు వస్తారా? లేక న్యాయపోరాటం కొనసాగిస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ కేసులో నిందితుడు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీ.వీ.సునీల్ కుమార్ ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు. కానీ, సునీల్ నాయక్ తనను నిందితుడిగా చేర్చడాన్నే సవాల్ చేస్తూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐడీ డీఐజీ హోదాలో అప్పటి ఎంపీ రఘురామరాజును అరెస్టు చేసి తీసుకువచ్చానని, అంతకుమించి తన పాత్ర లేదని సునీల్ నాయక్ వాదిస్తున్నారు. అయితే ఇతర నిందితులు, సాక్ష్యుల వాంగ్మూలం ప్రకారం రఘురామపై దాడి జరిగిన సమయంలో సునీల్ నాయక్ అక్కడే ఉన్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కేసులో సునీల్ నాయక్ పాత్ర చుట్టూ వాదోపవాదనలు తిరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సునీల్ నాయక్ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించడం హీట్ పుట్టిస్తోంది.