దేవ్ జీ, రాజిరెడ్డి ఎక్కడున్నారు? హైకోర్టులో మావోయిస్టు అగ్రనేతల కోసం పిటిషన్
దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలనే పిటిషన్ పై గురువారమే విచారణ జరిగింది.;
మావోయిస్టు అగ్రనేతలు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్ జీ బాడీగార్డులను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన ఎక్కడున్నారనేది తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే సమయంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్కౌంటరు అవడంతో దేవ్ జీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దేవ్ జీ తమ అదుపులో లేడని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దేవ్ జీతోపాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉన్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలనే పిటిషన్ పై గురువారమే విచారణ జరిగింది. అయితే ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారని నిరూపించేందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటూ న్యాయస్థానం పిటిషనర్లను ప్రశ్నించింది. ఇలాంటి వ్యాజ్యాల్లో ప్రాథమిక ఆధారాలు లేకుండా తాము జోకయం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల అభ్యర్థన మేరకు పోలీసు ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడిన వీడియోను కోర్టు ముందు ఉంచేందుకు విచారణను ఒక రోజు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ జి.తుహిన్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని దేవ్ జీ తమ్ముడు గంగాధర్, రాజిరెడ్డి కుమార్తె స్నేహలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫు న్యాయవాది జైభీమారావు వాదించారు. ఈ నెల 18న మావోయిస్టులు-పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని, ఈ సందర్భంగా దేవ్ జీ, రాజిరెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
కాగా, ఈ పిటిషన్ పై పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి.విష్ణుతేజ స్పందిస్తూ మావోయిస్టులు దేవ్ జీ, రాజిరెడ్డి పోలీసుల అదుపులో లేరని స్పష్టం చేశారు. పోలీసులు అరెస్టు చేసిన మొత్తం 50 మంది మావోయిస్టులను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంలో ధర్మాసనం కల్పించుకుని దేవ్ జీ, రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు ఎలా చెబుతున్నారు? అందుకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది.
దీనిపై పిటిషనర్ల తరపు న్యాయవాది స్పందిస్తూ దేవ్ జీ, రాజిరెడ్డి సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ 9 మంది కీలక నేతలు తమ అదుపులో ఉన్నారని ప్రకటించినట్లు కోర్టుకు నివేదించారు. ఆ వీడియోను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసును వాయిదా వేసింది.