రాజ్ భవన్ లోకి వెళ్ళేందుకు మరో సీనియర్ రెడీ ?

ఆయన కర్నూలు జిల్లాకు చెందిన పెద్దాయన టీజీ వెంకటేష్. ఆయన కుమారుడు టీడీపీలో మంత్రిగా కూడా ఉన్నారు.;

Update: 2025-04-19 22:30 GMT

సీనియర్లకు రెండే మార్గాలు ఉంటున్నాయి. అందులో ఒకటి పెద్దల సభలో అడుగుపెట్టడం మరొకటి హుందాగా రాజ్ భవన్ లోకి వెళ్ళి గవర్నర్ గా అయిదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేయడం. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవి అంటే అధికారంతో పాటు దర్జా అన్నీ ఉంటాయి.

దాంతో చాలా మంది గవర్నర్ కావాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏడు పదులు వయసు పైబడిన వారు అంతా రాజ్ భవన్ లోకి వెళ్ళడమే బెస్ట్ అనుకుంటున్నారుట. ఏపీలో చూస్తే కాబోయే గవర్నర్ల జాబితా పెరుగిపోతోంది.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్లు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, అలాగే మరో సీనియర్ యనమల రామక్రిష్ణుడు గవర్నలు కావాలని చూస్తున్నారు. ఈ ఇద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే కావడంతో ఎవరిని ఈ పదవి వరిస్తుంది అన్నది చర్చగా ఉంది. అదే సమయంలో ఇద్దరికీ గవర్నర్ పదవులు వస్తాయా లేక ఒకరికి రాజ్యసభ మరొకరికి గవర్నర్ పదవి సర్దుబాటు చేస్తారా అన్న చర్చ సాగుతోంది.

మరో వైపు చూస్తే టీడీపీలో ఈ రకమైన చర్చ ఉండగానే ఒకనాడు కాంగ్రెస్ ఆ తరువాత టీడీపీ అటు నుంచి బీజేపీలోకి వెళ్ళిన సీనియర్ మోస్ట్ నేత ఒకరు గవర్నర్ పదవి కోసం చూస్తున్నారు అన్నది ప్రచారంగా ఉంది. ఆయన కర్నూలు జిల్లాకు చెందిన పెద్దాయన టీజీ వెంకటేష్. ఆయన కుమారుడు టీడీపీలో మంత్రిగా కూడా ఉన్నారు.

ఇక టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి 2016లో రాజ్యసభకు వెళ్ళారు. ఆ తరువాత ఆయన 2020లో బీజేపీ లోకి మారారు. ఆయన పదవీ కాలం పూర్తి అయి మూడేళ్ళు గడచింది. దాంతో ఆయన తనకు గౌరవమైన పదవిని కోరుకుంటున్నారు. ఆయన టీడీపీకి సన్నిహితమైన నాయకుడు, బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆయనకు గవర్నర్ పదవి దక్కుతుందా అన్న చర్చ సాగుతోంది.

టీజీ వెంకటేష్ చూపు అయితే ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు మీద ఉంది అని అంటున్నారు. కానీ ఆ పదవి దక్కడం కష్టమని అంటున్నారు. బీజేపీ ఈ సీటు తీసుకున్నా ఆ పార్టీ పెద్దల మదిలో చాలా మంది పేర్లు ఉన్నాయని అంటున్నారు.

దాంతో పెద్దాయనకు తగిన పదవి గవర్నర్ అనే చర్చ అనుచరుల నుంచి వస్తోందిట. ఆయన కూడా అయితే ఇది లేకపోతే అది అన్నట్లుగానే ఉన్నారని చెబుతున్నారు. దాంతో టీజీ వెంకటేష్ గవర్నర్ కావాలని బలంగానే కోరుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.

మరో వైపు చూస్తే కనుక తొందరలో ఖాళీ అయ్యే గవర్నర్ల పదవులలో ఏపీ నుంచి మిత్ర పక్షంగా టీడీపీకి ఒక పోస్టు కేటాయిస్తారు అని ప్రచారం సాగుతోంది. మరి రెండవ పదవి ఏపీ నుంచే ఇస్తారా అన్నది అంతా చర్చిస్తున్నారు. అయితే ఇపుడు కాకపోయినా మరో విడతలో అయినా టీజీ వెంకటేష్ కి గవర్నర్ గా చాన్స్ దక్కుతుందని అంటున్నారు. ఆయనకు బీజేపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల రాజ్ భవన్ లోకి ప్రవేశించే అవకాశాలు అధికంగానే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News