గోదావరి పుష్కరాలకు కౌంట్ డౌన్...బాబు కొత్త రికార్డు

గోదావరి పుష్కరాలు ఏపీలో అంటే మామూలు విషయం కాదు, పన్నెండు రోజులూ ఏపీలో ఒక జాతరగా సాగుతుంది.;

Update: 2025-11-25 22:30 GMT

ప్రతీ పన్నెండేళ్ళకు గోదావరికి పుష్కరాలు వస్తాయి. అలా వచ్చిన పుష్కరాలలో పన్నెండు రోజుల పాటు భక్త జనం జాతర ఉంటుంది. ఈ పుష్కరాలలో కోట్లాది మంది ఆస్తిక జనులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. నాసిక్ లో పుట్టిన గోదావరి రెండు రాష్ట్రాలు దాటుతూ చివరికి ఏపీలోని సముద్రంలో కలుస్తుంది. ఆ సమయంలో అఖండ గోదావరిగా మారుతుంది. గోదావరి నిండు రూపం అంతా రాజమండ్రిలోనే ఉంటుంది. దాంతో గోదావరి పుష్కరాలు అంటే నార్త్ లో ఎలా ఉన్నా సౌత్ లో మాత్రం రాజమండ్రిలోనే గొప్పగా సాగుతుంది. ఇక ఈసారి గోదావరి పుష్కరాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

ఇవే తేదీలు :

గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. 2027 లో రానున్న ఈ పుష్కరాలలో కోసం పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసం కాబట్టి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపధ్యంలో గోదావరి పుష్కరాలను 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఘనంగా నిర్వహించనున్నారు అని చెబుతున్నారు. పండితులు పెట్టిన ముహూర్తంగా దీనిని చెబుతున్నారు. దాంతో ఇప్పటికి సరిగ్గా ఏణ్ణర్థం సమయం ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి తీరంలో అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. ఈసారి కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

భారీ ప్రణాళికతోనే :

గోదావరి పుష్కరాలు ఏపీలో అంటే మామూలు విషయం కాదు, పన్నెండు రోజులూ ఏపీలో ఒక జాతరగా సాగుతుంది. అందుకే ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఇప్పటి నుంచే భారీ ప్రణాళిలకను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా గోదావరి పుష్కరాల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది అంటున్నారు. వంద కోట్లను ఇప్పటికే కేటాయిస్తున్నారు అని అంటున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేసేందుకు ఏకంగా 272 కోట్ల రూపాయలను కేటాయించడం అందులో భాగమే అని అంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ అభివృద్ధి జరగనుంది. అదే విధంగా దేశం మొత్తం నుంచి రాజమండ్రికి నేరుగా రైళ్ళను నడిపేందుకు కేంద్రం ఈసారి ప్రత్యేక శ్రద్ధను చూపిస్తోంది అని అంటున్నారు.

గత అనుభవాల దృష్ట్యా :

ఇక గోదావరి పుష్కరాలు అంటే 2015లో జరిగిన చేదు ఘటనలు అందరికీ గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈసారి అలాంటి ఇబ్బందులు ఏ మాత్రం తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఫోకస్ చేస్తోంది అని అంటున్నారు. వేయి కోట్ల రూపాయాలో ఈసారి ఘాట్లను అభివృద్ధి చేయడమే కాకుండా ఎక్కువ మంది అక్కడ స్నానాలు ఆచరించేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు గోదావరి తీరంలో దాదాపుగా 17 నుంచి 18 దాకా ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లను మరింతగా సదుపాయాలతో విశాలం చేస్తున్నారు. అలా చేయడం వల్ల ప్రతీ రోజూ ఇరవై నాలుగు గంటల పాటు లెక్క తీసుకుంటే దాదాపుగా 75 లక్షల మంది వరకూ భక్తులు స్నానాలు చేసే చాన్స్ ఉంది అని అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం ఆలోచనలను బట్టి చూస్తే ఎనిమిది కోట్ల మంది దాకా భక్తులు వచ్చే అవకాశం ఉందని. అంటే ఈ పన్నెండు రోజులలో భక్తులు అంతా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా పుణ్య స్నానాలు ఆచరించేందుకు బృహత్ ప్రయత్నంలోనే కూటమి సర్కార్ ఉంది అని అంటున్నారు.

హ్యాట్రిక్ రికార్డుతో బాబు :

చంద్రబాబుకు ఎన్నో రకాలుగా అదృష్టం కలసి వస్తోంది అని చెప్పాలి. పుష్కరాలు అంటే పన్నెండేళ్ళకు ఒకసారి వస్తాయి. అలా 2003 తరువాత మూడు సార్లు వస్తే ఆ మూడు సార్లు చంద్రబాబే ఏపీ సీఎం గా ఉండడం అంటే రికార్డు బ్రేక్ అని చెప్పాల్సి ఉంది. చంద్రబాబు తొలిసారి 1995లో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆయన 2004 దాకా ఉన్నారు. 2003లో పుష్కరాలను బాగు తొలిసారి సీఎం హోదాలో నిర్వహించారు. తిరిగి పన్నెండేళ్ళు తిరిగేసరికి 2015లో పుష్కరాలు వచ్చే సమయానికి బాబే ఏపీకి సీఎం గా ఉన్నారు. ఇక 2027 లో మరోసారి పుష్కరాల వేళ బాబు ఏపీకి సీఎం గా ఉండడం ఆయన అదృష్టమే కాదు ఎంతో పుణ్య ఫలం అని ఆస్తిక జనులు అంటున్నారు. ఆ విధంగా బాబు హ్యాట్రిక్ రికార్డుని కొట్టారని అంటున్నారు.

Tags:    

Similar News