'ఎక్సైజ్ సురక్ష' ఇదే సకల సమస్యలకు సంజీవని అనుకుంటున్నారా?
ఆదివారమే యాప్ అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించినా,వినియోగానికి ఇంకొంత సమయం పట్టొచ్చని అంటున్నారు.;
ఏపీ ప్రభుత్వం కొత్తగా ‘ఎక్సైజ్ సురక్ష’ అనే యాప్ ను తీసుకువస్తుంది. మద్యం దుకాణాల్లో కల్తీ నివారించేందుకు గాను ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ ముద్రించాలని, దాన్ని స్కాన్ చేస్తే బాటిల్ తయారీతోపాటు ఇతర వివరాలను తెలుసుకునేలా ఎక్సైజ్ సురక్ష యాప్ ను పనిచేయాలని సీఎం నిర్ణయించారు. ఆదివారమే యాప్ అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించినా,వినియోగానికి ఇంకొంత సమయం పట్టొచ్చని అంటున్నారు. అయితే ఈ యాప్ వల్లనే నకిలీ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్లు కల్తీ మద్యం తయారీ అనేది వారసత్వంగా వచ్చిన సమస్యేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న చర్చ కూడా ఎక్కువగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ములకలచెరువులో కల్తీ మద్యం వెలుగు చూసిన తర్వాత టీడీపీ నేతల పాత్ర కూడా అందులో ఉందని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. నకిలీ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసి ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నా, విపక్షం మాత్రం ప్రభుత్వాన్ని అంత తేలిగ్గా వదలడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు మరణించినా, కల్తీ మద్యమే కారణమన్నట్లు ప్రచారం చేస్తోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తులో నకిలీ మాట వినిపించకుండా ఉండేందుకు యాప్ తీసుకురావాలని నిర్ణయించారని అంటున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి చెప్పినట్లు మద్యం కల్తీ రాష్ట్రంలో ఇప్పుడే కొత్తగా జరుగుతున్న దందా కాదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం విక్రయించారన్న కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఎరులై పారేది. అదే సమయంలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగేవి. ఇదే సమయంలో నకిలీ మద్యం తయారుచేసి బాట్లింగ్ చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. అయితే ప్రస్తుతం కూడా అదే పద్ధతి కొనసాగడానికి కూటమి ప్రభుత్వంలో తీసుకున్న ఓ నిర్ణయం కూడా కారణమనే వాదన వినిపిస్తోంది.
గత ప్రభుత్వంలో అంటే నాసిరకం మద్యం వల్ల నకిలీ లిక్కర్ తయారైందని చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు కూడా అదే దందా కొనసాగడానికి కారణాలపైనా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యంతోపాటు రూ.99 లిక్కర్ కూడా అందుబాటులో ఉంది. కానీ, కొందరు వ్యాపారులు ఇప్పుడు నకిలీ మద్యం తయారీ లేదా ఖరీదైన మద్యం బాటిళ్లలో నాసిరకం మద్యం కలపడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వ విధానం కూడా ఉందని అంటున్నారు.
ఏడాది కిందట మద్యం పాలసీ మార్చిన తరువాత ప్రభుత్వ దుకాణాలు బదులుగా ప్రైవేటు మద్యం షాపులు ఏర్పాటుకు నిర్ణయించారు. ఆ సమయంలో వ్యాపారులకు 20 శాతం కమీషన్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. మద్యం నోటిఫికేషన్ సమయంలోనూ 20 శాతం కమీషన్ ఇస్తామనే చెప్పినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కానీ, షాపుల కేటాయింపు సమయంలో కమీషన్ మొత్తాన్ని పది శాతానికి తగ్గించేశారు. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు గగ్గోలు పెడుతున్నారు.
ఇదే సమయంలో వారి నుంచి వచ్చిన ఒత్తిడితో కమీషన్ ను 14 శాతానికి ప్రభుత్వం పెంచింది. అయినప్పటికీ నష్టాలే ఎదురవుతుండటం వల్ల కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సురక్ష యాప్ తీసుకువచ్చిన ప్రభుత్వం.. తమ కమీషన్ కూడా పెంచితే అసలు మద్యంలో కల్తీ అనేది లేకుండా తామే చూసుకుంటామని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ విషయం ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్లడమే పెద్ద సాహసంగా మారిపోయిందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు.