అందుకే అడిగి మ‌రీ ఆ శాఖ‌ను తీసుకున్నా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కేవ‌లం ఏడాదిన్న‌ర కాలంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింద‌ని డిప్యూ టీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ తెలిపారు.;

Update: 2025-12-11 04:26 GMT

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కేవ‌లం ఏడాదిన్న‌ర కాలంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింద‌ని డిప్యూ టీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ తెలిపారు. అధికారుల మ‌ధ్య , శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం బాగుంద‌న్నారు. దీంతో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చే క్ర‌మంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ `మాట - మంతి` కార్యక్రమం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య,నిరుద్యోగం వంటి సమస్యలపై ప్ర‌తి అధికారి జాగ్ర‌త్త‌గా ఆలోచ‌న చేయాల‌న్నారు. పల్లెలు దేశానికి వెన్నెముక లాంటివని, అందుకే అడిగి మ‌రీ తాను పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. ఈ శాఖలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన‌ట్టు చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అధికారుల అనుభవం, సూచనలతోనే తప్ప త‌న సొంత నిర్ణ‌యాలు ఏమీ లేవ‌న్నారు.

అనేక సమీక్షల తర్వాత ఈ శాఖలో చాలా రిఫామ్స్ తీసుకురావాలని అనిపించిందని, ఆ దిశగానే చర్యలు తీసుకున్నామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఈ శాఖలో ఔట్ సోర్సింగ్ తో కలిపి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారన్న ఆయ‌న వీళ్ళందరిలో పదివేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో కూడా చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి సిఫార్సులు లేకుండా ప‌నులు చేస్తున్నామ‌ని చెప్పారు.

గత ఏడాదిన్నర కాలంలో ఎన్నడూ లేని విధంగా పాలనలో సంస్కరణలు తీసుకొచ్చామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. దీనిలో భాగంగా పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మార్చామ‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయి సిబ్బందితో 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించామ‌ని చెప్పారు. కెపాసిటీ బిల్డింగ్‌లో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ఏపీని దేశంలోనే మొదటిస్థానంలోకి తీసుకొ చ్చామ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లే ప్రాధాన్య‌మ‌ని.. ఈ కూట‌మి మ‌రో 15 ఏళ్ల‌పాటు సుస్థిరంగా ఉంటుంద‌ని.. ఈ విష‌యాన్ని అధికారులు కూడా గుర్తుంచుకోవాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News