తీవ్ర జ్వరంతో పవన్ ఏం చేశారో తెలుసా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. మరోవైపు తన పరిధిలోని శాఖల ముఖ్య అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు జ్వరంతో బాగా నీరసించిపోయినా, శక్తిని కూడదీసుకుని ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం రాష్ట్ర సచివాలయంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండు రోజులుగా జ్వరం తీవ్రంగా ఉన్నా విశ్రాంతి తీసుకోకపోవడంతో బాగా నీరసంగా కనిపిస్తున్నారు. దీంతో ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
వైద్యుల సూచనలతో డిప్యూటీ సీఎం పవన్ బుధవారం అసెంబ్లీకి హాజరుకాలేదు. రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచనలతో ఆయన తన నివాసానికి పరిమితమయ్యారు. కానీ, విధులను నిర్వర్తించడం ఆపలేదు. తీవ్ర జ్వరంతో ఇంటి వద్దే ఉన్నప్పటికీ టెలి కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షిస్తూ తన అంకితభావం చాటుకుంటున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. విధి నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీపడతానని మాటలు చెప్పడమే కాకుండా ఆచరణలోనూ చూపుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యనిస్తున్నారు.
ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, గత మూడురోజుల నుంచి పవన్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. జ్వరంతో ఉన్నప్పటికీ 22వ తేదీ నుంచి పవన్ సభకు హాజరవుతూనే ఉన్నారు. అయితే ఆయన నీరసంగా కనిపించడంపై ఎమ్మెల్యేలు వాకబు చేయగా, జ్వరంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందని అంటున్నారు. దసరా శరన్నవరాత్రులు సందర్భంగా పవన్ ఉపవాస దీక్షలు చేస్తున్నారు. జ్వరం వల్ల బాగా నీరసించిపోయినా సంప్రదాయ దీక్షలను ఆయన విస్మరించకపోవడం విశేషం.
ఇక బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహం జరుగుతోంది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ ను విశిష్ట అతిథులుగా ఆహ్వానించారు. ముందుగా పవన్ పర్యటన ఖరారు కావడంతో ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారని అంటున్నారు. అయితే జ్వరం కారణంగా పవన్ పాలకొల్లు వెళ్లకపోవచ్చని సమాచారం. దీంతో పవన్ వస్తున్నారని పాలకొల్లు వచ్చిన ఆయన అభిమానులు ఉసూరుమంటున్నారు.