'లాజిస్టిక్స్ కారిడార్‌గా ఆ మూడు నగరాలు.. అసలు లాజిస్టిక్స్ కారిడార్ అంటే ఏంటి?
రాష్ట్రంలో తీర ప్రాంత నగరాలను కలపుతూ పారిశ్రామిక లాజిస్టిక్స్ కారిడార్ ఏర్పాటు చేయనన్నట్లు వెల్లడించారు.;
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తీర ప్రాంత నగరాలను కలపుతూ పారిశ్రామిక లాజిస్టిక్స్ కారిడార్ ఏర్పాటు చేయనన్నట్లు వెల్లడించారు. సింగపూర్ లో సముద్రాన్ని పూడ్చి నిర్మించిన సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్ ను పరిశీలించిన సందర్భంగా ఏపీలోనూ కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ లాజిస్టిక్స్ కారిడార్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను సీఎం బయటపెట్టారు. కాకినాడ, కృష్ణపట్నంలో ఇప్పటికే పోర్టులు ఉండగా, మచిలీపట్నంలో ప్రస్తుతం పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఈ పోర్టులను అనుసంధానించి వాటికి సమీపంలో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కానుందని సీఎం తెలిపారు.
మూడు పోర్టుల అనుసంధానం
సింగపూర్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రో కెమికల్ ఐ ల్యాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం సందర్శించింది. జురాంగ్ ఐల్యాండ్ లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను చూసి ఆకర్షితులైన ముఖ్యమంత్రి బృందం ఏపీలో రామాయపట్నం సమీపంలో ఏర్పాటుకానున్న బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీకి అనుసంధానిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రధాన పోర్టులతో కారిడార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు.
చాలా ప్రయోజనాలు
లాజిస్టిక్స్ కారిడార్ ద్వారా చాలా ప్రయోజనాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మన దేశంలో ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి జరిగిందన్న అంచనాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కారిడార్లు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలోనూ విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు-చెన్నై కారిడార్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ జురాంగ్ పెట్రో కెమికల్ ఐలాండ్ చూసి తీర ప్రాంతంలో లాజిస్టిక్స్ కారిడార్ ను తెరపైకి తెచ్చారు. దీనివల్ల రవాణా వ్యయం భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కాలం కూడా ఆదా అవుతుందని అంటున్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని భావిస్తున్నారు.
సముద్రాన్ని పూడ్చి..
సింగపూర్ లో సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవిలో సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్, ఇంధన కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పెట్రో కెమికల్ ఐ ల్యాండ్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి బృందానికి దాని విశిష్టతను నిర్మించిన విధానాన్ని సుర్బానా జురాంగ్ డిప్యూటీ డైరెక్టర్ టియో ఎంగ్ కియాట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీలీ వివరించారు. వ్యూహాత్మకంగా ఈ కేంద్రం ఎంత కీలకమైన సేవల్ని అందిస్తోందని తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం చేసిన ప్రణాళికల్ని , వివిధ యుటిలిటీ మోడల్స్ తో పాటు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రికి చూపారు.
పెట్రోకెమికల్ కేంద్రంలో ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతో పాటు ఇతర ఉత్పత్తులైన పాలిమర్, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తెలుసుకున్నారు. మొత్తం 3 వేల హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు చేసినట్టు జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించినట్టు వివరించారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ తో పాటు సమీకృత భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు కూడా గ్లోబల్ పార్టనర్‌లుగా కలసి రావాలని ముఖ్యమంత్రి కోరారు.