చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు.. చంద్రబాబు సంచలన ప్రకటన

ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు.;

Update: 2026-03-06 10:19 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. గత కొంతకాలంగా మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, డిజిటల్ వేధింపులను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు.

ఈ అంశంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించేలా ప్రభుత్వం సీరియస్ గా ఉందని వెల్లడైందని అంటున్నారు. చిన్నపిల్లలు, మైనర్లు సోషల్ మీడియాను వాడటం వల్ల రాష్ట్రంలో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిందని అంటున్నారు. మానవ వనరుల శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేశ్ ఈ విషయమై తన ఆందోళనలను గత జనవరిలో తొలిసారిగా బయటపెట్టారు. దావోస్ ఎకనామిక్ సదస్సులో మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత ఈ దిశగా ప్రభుత్వం తరఫున చకచకా పావులు కదిపారు. కేంద్రంతో సంప్రదించి ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో అధికారుల కమిటీని నియమించారు. అధికారుల బృందం ప్రస్తుతం మైనర్లు సోషల్ మీడియా వినియోగంపై ఎటువంటి ఆంక్షలు తీసుకురావాలనే అంశమై విధి విధానాలను రూపొందించే పని చేస్తోంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా అటువంటి బలమైన చట్టపరమైన నిబంధనలు అవసరమని భావిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై విస్తృత చర్చ జరుగుతోంది.

గతంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఆంక్షలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వయసును 13 ఏళ్లకు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే 13 నుంచి 16 ఏళ్లలోపు పిల్లల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోకూడదని, టెక్నాలజీని ఆయుధంగా వాడుకోవాలి కానీ, బానిసగా మారి జీవితాలు పాడు చేసుకోకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వచ్చే 90 రోజుల్లో సోషల్ మీడియా చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. దీంతో వచ్చే వర్షాకాల సమావేశాల తర్వాత ఏపీలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News