అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తిస్తుందా?

దేశంలో మరే రాష్ట్రంలో లేని విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని ఇప్పటివరకు ఏపీకి రాజధాని అంటూ లేని పరిస్థితి.;

Update: 2025-12-12 03:47 GMT

దేశంలో మరే రాష్ట్రంలో లేని విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని ఇప్పటివరకు ఏపీకి రాజధాని అంటూ లేని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పటికీ.. అన్ని విషయాల్లోనూ తమను బుల్ డోజ్ చేస్తారని ఆంధ్రోళ్ల మీద అదే పనిగా విరుచుకుపడే వారికి భిన్నంగా.. ఆంధ్రోళ్లు తమదైన రాజధాని నగరాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోని వైనం కనిపిస్తుంది. కొందరు అదే పనిగా ఆంధ్రోళ్లనేు ఉద్దేశించి తరచూ అదే పనిగా విమర్శించటం.. ఆడిపోసుకోవటం లాంటివి చేయటం తెలిసిందే.

వారి వాదనలో నిజమే ఉండి ఉంటే..తమ ప్రాంతంలోనే రాజధాని నగరాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదన్న ప్రశ్నకు సరైన సమాధానం రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి పుష్కరం కావొస్తున్నా ఇప్పటికి రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. విభజన తర్వాత 2014లో కొలువు తీరిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొంటూ హడావుడి చేసినప్పటికి సాంకేతికంగా..చట్టబద్ధంగా మాత్రం అమరావతికి రాజధాని గుర్తింపు లభించని దుస్థితి.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని అంశంపై తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన తీరుతో రాజధాని అన్నది ఓ పెద్ద ఇష్యూగా మారటం తెలిసిందే. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. రాజధానిగా చెబుతున్న అమరావతికి ఇప్పటివరకు కేంద్రం గుర్తింపు రాని పరిస్థితి.

ఇలాంటి వేళ.. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించాలని.. ఆ మేరకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసింది. అదే సమయంలో దీనికి సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేవ పెట్టేందుకు వీలుగా బడ్జెట్ సమావేశాల్ని వేదికగా చేసుకోనుంది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.

అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ దానికి చట్టబద్ధత కల్పిస్తూ చట్టాన్ని సవరించాలని కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వానికి డిసెంబరు ఒకటిన లేఖ రాసింది. దీంతో 2024 జూన్ 2 నుంచి ఏపీ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని కోరుతూ కేంద్రానికి జవాబు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. చట్టసవరణ బిల్లును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో తీసుకొచ్చి.. దానికి ఆమోదముద్ర వేసి పంపాలని కూటమి సర్కారు భావిస్తోంది. విభజన సవరణ బిల్లు ఆమోదం పొంది.. కేంద్రం అందుకు తగ్గట్లు ఉత్తర్వులు జారీ చేస్తే ఎంతమంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా.. అమరావతిని ఏపీ రాజధాని కాకుండా ఆపలేరని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు.

అమరావతికి రాజధాని హోదా 2014 నుంచి ఇవ్వాలా? 2024 నుంచి ఇవ్వాలా? అన్నది టెక్నికల్ అంశమని.. దీనికి సంబంధించిన క్లారిటీని ఏపీ ప్రభుత్వాన్ని అడిగినట్లు చెప్పిన ఆయన.. ఈసారి సమావేశాల్లో కాకున్నా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అయినా దీనికి సంబంధించి బిల్లు పెట్టి ఆమోదిస్తామని స్పస్టం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తూ అమరావతిని నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంతో కొత్త సంవత్సరంలో ఏపీ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు లభిస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News