రెండవ మంత్రి పదవి : టీడీపీకా...జనసేనకా ?

ఇక విశాఖ జిల్లాలో ఈసారి విస్తరణలో కచ్చితంగా ఒకరికి చాన్స్ ఉంటుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ జిల్లాలోనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ అభివృద్ధికి అవకాశం ఇస్తోంది.;

Update: 2026-03-22 13:30 GMT

తొందరలోనే కూటమి ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. 2024లో మంత్రివర్గం ఏర్పాటు అయినపుడు విశాఖ జిల్ల్లాకు మంత్రి పదవి దక్కలేదు. మొత్తం అంతా కూటమి ఎమ్మెల్యేలే ఇక్కడ గెలిచారు. అంతే కాదు రాష్ట్రంలో తొంబై వేల పై దాటి మెజారిటీ వచ్చిన టాప్ త్రీ ర్యాంకర్లలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ జిల్లాలోనే ఉన్నారు. వారిలో ఒకరు భీమిలీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే రెండవ వారు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని అంతా అంచనా వేశారు. కానీ ఏకంగా విశాఖ జిల్లాకే మంత్రి పదవికి చోటు లేకుండా పోయింది.

అనకాపల్లి జిల్లాకి :

ఇక అనకాపల్లి జిల్లాలోనూ కూటమి ఎమ్మెల్యేలే మొత్తం గెలిచారు. అయితే ఈ జిల్లా నుంచి పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యేగా రెండవ సారి గెలిచిన వంగలపూడి అనితకు హోం మంత్రి పదవి అనూహ్యంగా దక్కింది. అలాగే సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న నర్శీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుకి స్పీకర్ పదవిని ఇచ్చి తగిన న్యాయం చేశారు. అయితే అనకాపల్లిలోనూ సీనియర్ నేతలు చాలా మంది మంత్రి పదవి కోసం ఆశ పడిన పరిస్థితులు ఉన్నాయి. అనకాపల్లి నుంచి గెలిచిన సీనియర్ నేత కొణతాల రామక్రిష్ణకు మంత్రి పదవి కచ్చితంగా జనసేన కోటాలో దక్కుతుందని అంతా అనుకున్నారు. సౌమ్యుడు వివాదరహితుడు, పైగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు జిల్లా రాజకీయాల మీద సామాజిక భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉన్న కొణతాలకు మంత్రి పదవి ఖాయమని లెక్కలేసుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. అలాగే మరో సీనియర్ నేత మాడుగుల నుంచి ఎమ్మెల్యే అయిన బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి పదవిని ఆశించారు అని ప్రచారం సాగింది.

విస్తరణలో విస్తరి :

ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అంతటా ప్రచారం సాగుతోంది. దాంతో కచ్చితంగా మంత్రి పదవి ఈ రెండు జిల్లాలలో ఆశావహులకు దక్కుతుందని అనుచరులు అయితే ధీమాగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే కొణతాల రామక్రిష్ణకు జనసేన తరఫున ఇచ్చే మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. జనసేనలో ముగ్గురు మంత్రులు ఉన్నారు, విశాఖ నుంచి మరో మంత్రి పదవిని ఆ పార్టీ ఆశిస్తోంది. ఆ పదవిని బీసీ నేతకు సీనియర్ కి ఇవ్వడం ద్వారా జనసేన సామాజిక న్యాయం పాటించాలని చూస్తోంది అని అంటున్నారు. అంతే కాదు ప్రాంతీయ సమతూకం సరిపోతుందని ఉత్తరాంధ్రాలో రానున్న కాలంలో మరింతగా బలపడేందుకు కొణతాల లాంటి వారికి మంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

విశాఖ జిల్లాలో చూస్తే :

ఇక విశాఖ జిల్లాలో ఈసారి విస్తరణలో కచ్చితంగా ఒకరికి చాన్స్ ఉంటుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ జిల్లాలోనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ అభివృద్ధికి అవకాశం ఇస్తోంది. దాంతో మంత్రి స్థానికంగా ఉంటే బాగుంటుంది అన్న భావన నెలకొంది అంటున్నారు. అయితే ఈ మంత్రి పదవి కోసం టీడీపీలో పోటీ భారీగానే ఉంది. అలాగే బీజేపీ నుంచి జనసేన నుంచి ఆశిస్తున్న వారు ఉన్నారు. ఇక విశాఖ జిల్లాను ఉమ్మడిగా చూసినపుడు స్పీకర్ పదవి ఇచ్చారు, ఒక మంత్రిగా ఇప్పటికే హోం మంత్రి ఉన్నారు. ఇస్తే గిస్తే మరో పదవి ఇస్తారు అని అంటున్నారు. మరి దాని కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటే ఎవరికి దక్కుతుంది అన్నదే చర్చగా ముందుకు వస్తోంది.

రెండు పార్టీల మధ్యలో :

రెండు పార్టీలైన జనసేన టీడీపీ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లాలో రెండవ మంత్రి పదవి ఉండదని అంటున్నారు. ఒకవేళ ఉంటే వంగలపూడి అనితకు పక్కన పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. విశాఖ జిల్లాలో మంత్రి పదవి అయితే కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. మరి కొణతాలకు మంత్రి పదవి అంటూ వస్తున్న ఊహాగానాల సంగతేంటని ఆలోచిస్తే మాత్రం అనితని తప్పిస్తేనే తప్ప అది సాధ్యపడదని అంటున్నారు విస్తరణ కానీ పునర్ వ్యవస్థీకరణ కానీ చేస్తే అపుడు భారీ మార్పులు ఉండొచ్చని అలా పాత వారిలో ఆరేడు మందిని పక్కన పెట్టి కొత్త వారికి చోటు ఇవ్వవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా కాబోయే మంత్రులుగా కొణతాల రామక్రిష్ణతో పాటు పల్లా శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News