ప్రతీ ఓటరుకూ అరడజన్ ఓట్లు... కూటమి చాన్స్

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జెడ్పీ చైర్మన్లకు మేయర్, మునిసిపాలిటీల చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ మేరకు కేబినెట్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Update: 2026-08-19 00:30 GMT

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జెడ్పీ చైర్మన్లకు మేయర్, మునిసిపాలిటీల చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ మేరకు కేబినెట్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వీరందరినీ ప్రజలే నేరుగా ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు చట్ట సవరణల కోసం శాసనసభలో బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు ఉన్న పరోక్ష విధానాన్ని మార్చి, సర్పంచ్‌ల మాదిరిగానే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్‌పర్సన్‌లను ఓటర్లు నేరుగా ఎన్నుకునే పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతంలో ఒక ఓటరు అయితే నాలుగేసి ఓట్లు వేసే చాన్స్ ని కూటమి ప్రభుత్వం కల్పించింది. అలాగే పట్టణాలు, నగరాలలో అయితే రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది.

పదమూడు కాస్తా 28 గా :

ఇక ఏపీలో ప్రస్తుతం 13 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. వాటిని ఏకంగ 28 దాకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రతీ కొత్త జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది అన్న మాట. అలాగే ఏపీలో మున్సిపల్ కార్పోరేషన్లు మునిసిపల్ చైర్మన్లు కలుపుకుని 125 దాకా ఉన్నాయి. అదే విధంగా మండలాలు కూడా 638 వందలకు పైగా ఉన్నాయి. ఇక పంచాయతీలు అయితే 13 వేల దాకా ఉన్నాయి. వీటన్నింటికీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కోల్పోకుండా ఉండటానికి అక్టోబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారులను ఆదేశించించింది.

వారికి ఎన్ని ఓట్లో :

ఇదిలా ఉంటే మండలాలలో ఉన్న వారికి నాలుగేసి ఓట్లు ఉండబోతున్నాయి. మామూలుగా అయితే వారు జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఇపుడు మండల పరిషత్ చైర్మన్ కి అలాగే జిల్లా పరిషత్తు చైమన్ కి కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. దాంతో నాలుగు ఓట్లు వారికి ఉంటాయి అన్న మాట. ఈ మండలాలో గ్రామ పంచాయతీలు కూడా కలసి ఉంటాయి కాబట్టి పంచాయతీ సర్పంచ్ కి ఒక ఓటు, తామున్న వార్డు మెంబర్ కి మరో ఓటు వేయడం అదనం అవుతుంది. ఆ విధంగా అరడజన్ ఓట్లు ఒక ఓటరుకు దక్కబోతున్నాయని అంటున్నారు.

వారికి రెండేసి ఓట్లు :

ఇక మునిసిపాలిటీలలో నివసించే ఓటర్లు తమ వార్డు కౌన్సిలర్ ని ఎన్నుకోవడానికి ఒక ఓటు, అలాగే ప్రత్యక్ష ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ ని ఎన్నుకోవడానికి మరో ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే రెండు ఓట్లు అన్న మాట. నగరాలలో ఉన్న వారు తమ డివిజన్ లో కార్పోరేటర్ ని ఎన్నుకోవడానికి ఒక ఓటు అలాగే మేయర్ కోసం మరో ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వీరికి కూడా రెండు ఓట్లు లభిస్తాయని అంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతంలోని వారు ఎలాంటి కన్ ఫ్యూజన్ చెందకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధం పడుతోంది. బ్యాలెట్ పేపర్ మీదనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల అభ్యర్ధులకు బ్యాలెట్ పేపర్ ఒక రంగులో ఉండేలా వార్డు డివిజన్ లకు మరో రంగులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు అని అంటున్నారు. మొత్తం మీద ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం మంచి సంప్రదాయం అని జనాలు అంటున్నారు. దాని వల్ల మేయర్ కానీ జెడ్పీ చైమన్ మండల పరిషత్ చైర్మన్ కానీ నేరుగా ప్రజలకు బాధ్యులుగా ఉంటారని అంటున్నారు.

Tags:    

Similar News