క్యాబినెట్ భేటీ: విమ‌ర్శ‌లు రాకుండా ఎలా ఉంటాయి బాబూ!?

కానీ, తాజాగా జ‌రిగిన ఏపీ క్యాబినెట్ స‌మావేశంలో ఏ ఒక్క స‌మ‌స్య‌పైనా సీఎం కానీ.. మంత్రులు కానీ చర్చించలేదు. ఇది వాస్త‌వం. పోనీ.. అస‌లు స‌మ‌స్యేలేవా? అని అనుకుంటే.. క‌ళ్ల ముందే కోకొల్ల‌లుగా కీల‌క స‌మ‌స్య‌లు క‌నిపిస్తున్నాయి.;

Update: 2025-10-11 14:30 GMT

ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా.. క్యాబినెట్ స‌మావేశం నిర్వ‌హించాలి. నిర్వ‌హిస్తుంది కూడా. అయితే.. ఈ స‌మావేశం ప‌ర‌మార్థం వేరు. ప్ర‌స్తుతం దాదాపు కేంద్రం నుంచి రాష్ట్రాల ప్ర‌భుత్వాల వ‌ర‌కు జ‌రుగుతున్న‌వి వేరు. దీంతో కేబినెట్ స‌మావేశాలు అంటే.. కేవ‌లం స్వోత్క‌ర్ష‌లు ప‌ర‌నింద‌ల‌కే ప‌రిమితం అవుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. సుదీర్ఘంగా 4-6 గంట‌ల పాటు సీఎం చంద్ర‌బాబు, మంత్రులు భేటీ అయ్యారు.

అయితే.. ఈ భేటీపై ప్ర‌తిప‌క్షాలే కాదు.. త‌ట‌స్థుల నుంచి కూడా భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలోనూ విమ‌ర్శ‌ల‌కు కొద‌వ‌లేకుండా పోయింది. మ‌రి ఇంత‌గా విమ‌ర్శ‌లు రావ‌డానికి కార ణం ఏంటి? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని, స‌మ‌స్యలు ఉంటే వాటిని మంత్రులతో చ‌ర్చించి వాటికి ప‌రిష్కారాలు తెలుసుకునేందుకు సీఎం ఈ స‌మావేశాన్ని వినియోగించుకుంటారు. ఇది స‌హ‌జం. త‌న ఆలోచ‌న‌ల‌ను మంత్రుల‌కు చెప్పి.. వారి ఆలోచ‌న‌లు కూడా తీసుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తారు.

కానీ, తాజాగా జ‌రిగిన ఏపీ క్యాబినెట్ స‌మావేశంలో ఏ ఒక్క స‌మ‌స్య‌పైనా సీఎం కానీ.. మంత్రులు కానీ చర్చించలేదు. ఇది వాస్త‌వం. పోనీ.. అస‌లు స‌మ‌స్యేలేవా? అని అనుకుంటే.. క‌ళ్ల ముందే కోకొల్ల‌లుగా కీల‌క స‌మ‌స్య‌లు క‌నిపిస్తున్నాయి.

1) రైతుల‌కు ఇప్పటికీ యూరియా కొర‌త వెంటాడుతోంది.

2) ఉల్లి పాయ‌ల రైతులుగిట్టిబాటు ధ‌ర‌లు లేక త‌మ పంట‌ల‌ను న‌దుల్లోనూ కాలువ‌ల‌లోనూ పార‌బోస్తున్నారు.(క్యాబినెట్ మీటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే క‌ర్నూలులో 10 మంది రైతులు త‌మ పంట‌ల‌ను నీటి పాలు చేయ‌డం గ‌మ‌నార్హం.)

3) ప‌లు జిల్లాల్లోని విద్యార్థుల హాస్ట‌ళ్ల‌లో నీరు, ఆహారం క‌ల్తీ కార‌ణంగా ప‌దుల సంఖ్య‌లో విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

4) గుంటూరు జిల్లా తుర‌క‌పాలెంలో గుర్తించ‌ని జ్వ‌రంతో మ‌ర‌ణాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

5) ట‌మాటా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా విల‌విల్లాడుతున్నారు.

6) ల‌క్ష‌ల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు త‌మ త‌మ వేత‌నాలు, డీఏ, పీఆర్సీ కోసం ప‌ట్టుబడుతూ.. నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు దిగారు. ప్ర‌భుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు.

7) వైసీపీ నేతృత్వంలో చేప‌ట్టి మెడిక‌ల్ కాలేజీల పీపీపీ వ్య‌తిరేక నిర‌స‌న‌లు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాయి. వీటికి సంబంధించి ప్ర‌భుత్వం ఇచ్చిన కాంట్రాక్టు ప్ర‌క‌ట‌న‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ స్పందించ‌లేదు.

8) క్షేత్ర‌స్థాయిలో న‌కిలీ మ‌ద్యం వ్య‌వ‌హారం దుమ్మురేపుతోంది.

9) జ‌న‌సేన‌-టీడీపీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంది.

ఇలా.. అనేక స‌మ‌స్య‌లు ఉన్నా.. ఒక్క‌దానిపైనా ప్ర‌భుత్వం చ‌ర్చించ‌లేదు. ఈ విష‌యాన్నే ఎత్తి చూపుతూ.. ప‌లువురు ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇవి త‌ప్ప‌! అన్న‌ట్టుగా సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌తో ఇత‌ర విష‌యాలు చ‌ర్చించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News