పార్లమెంటులో అమరావతి బిల్లు.. వైసీపీ వ్యూహామేంటి?

రాజధాని అమరావతిపై ప్రతిపక్షం వైసీపీ తుది నిర్ణయం తీసుకోవాల్సిన టైము వచ్చిందా? అనే చర్చ జరుగుతోంది.;

Update: 2026-01-22 08:17 GMT

రాజధాని అమరావతిపై ప్రతిపక్షం వైసీపీ తుది నిర్ణయం తీసుకోవాల్సిన టైము వచ్చిందా? అనే చర్చ జరుగుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టం చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పార్లమెంటులో వైసీపీ తన వైఖరి స్పష్టం చేయాల్సివస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అనేక వాదనలు వినిపించింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణాలపై కనీసం శ్రద్ధ పెట్టలేదు. అదే సమయంలో మూడు రాజధానుల నినాదం తీసుకోవడం వల్ల రాజధానిగా అమరావతి ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధత ఏర్పడింది. ఇక ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కేంద్రంగానే పాలన సాగుతోంది. అయితే తొలుత ఈ విషయంలో కాస్త సైలెంటుగా ఉన్న వైసీపీ ఇటీవల మళ్లీ కొత్త వాదనలు వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటూ చెప్పడమే కాకుండా, రాజ్యాంగంలో రాజధాని అన్న ప్రస్తావనే లేదని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం అమరావతిపై చట్టం చేయనుండటంతో ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటివరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును వైసీపీ మద్దతు పలికింది. యథావిధిగా అమరావతి బిల్లును ఆమోదిస్తారా? లేక భిన్న వైఖరి ప్రదర్శిస్తారా? అన్నదే ఉత్కంఠ పుట్టిస్తోంది. రాజధాని అమరావతిపై 2019 నుంచి వైసీపీలో భిన్నమైన వైఖరే కనిపిస్తోందని అంటున్నారు. ఆ పార్టీలో ఏ ఒక్కరూ రాజధాని అమరావతికి సానుకూలం అంటూ ప్రకటన చేయలేదని అంటున్నారు.

దీంతో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుపై వైసీపీ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో ఆరు రోజుల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పార్టీ ఎలాంటి వైఖరి అనుసరించాలన్న విషయమై మాజీ సీఎం జగన్ తన పార్టీ ఎంపీలతో గురువారం చర్చించనున్నారు. ఇందులోనే అమరావతిపై పార్లమెంటులో ఎలా వ్యవహరించాలన్న విషయమై దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. అయితే అమరావతిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండటం వల్ల ఆయన స్టాండు ఎలా ఉంటుంది? వ్యతిరేకించే సాహసం చేస్తారా? లేక మద్దతిస్తే ఏమని సమర్థించుకుంటారన్నది చర్చకు దారితీస్తోంది.

2014లో రాష్ట్ర విభజన సమయంలో రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాదును వాడుకోవాలని నాటి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ గడువు గత ఏడాది జూన్ 2తో ముగిసింది. అదే ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు రావడం, వైసీపీ గద్దె దిగడం జరిగింది. ఇక ఆ తరువాత కూటమి ప్రభుత్వం అమరావతికి అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా, ఇంతవరకు చట్టబద్దత కల్పించలేకపోయింది. దీనిపై రాజధాని రైతులు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి ఉపశమనం కలిగించేలా కేంద్రం చట్టం చేయడానికి రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. ఈ పరిణామమే వైసీపీకి కలవరపాటుకు గురిచేస్తోంది. రాజధానిపై పార్లమెంటులో ఏ ప్రకటన చేసిన అది రికార్డు అయ్యే అవకాశం ఉంది. ఆ విషయం నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదని అంటున్నారు. దీంతో వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోందన్నదే సస్పెన్స్ గా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News