చిన్నమ్మా... దయ చూడమ్మా !
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి నామినేటెడ్ పదవుల విషయంలో పెద్దగా పట్టుబట్టడం లేదన్నది బీజేపీ నేతల ప్రధాన ఫిర్యాదుగా ఉంది.;
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి నామినేటెడ్ పదవుల విషయంలో పెద్దగా పట్టుబట్టడం లేదన్నది బీజేపీ నేతల ప్రధాన ఫిర్యాదుగా ఉంది. పైగా ఆమె కూటమి పెద్దలతో పలుకుబడిని ఉపయోగించే తాహతు స్థాయిలో ఉండి కూడా పదవుల పందేరంలో అన్యాయం అయిపోతున్న బీజేపీ నేతల విషయంలో ఉదాశీనంగా ఉన్నారని అంటున్నారు.
ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి అయింది. నామినేటెడ్ పదవులు ఈ మధ్య కాలంలో వందల దాకా ఇచ్చారు. అయితే ఇందులో టీడీపీ డెబ్భై శాతం దాకా దక్కితే ఇరవై నుంచి పాతిక శాతం దాకా జనసేనకు దక్కాయి. కేవలం అయిదు శాతమే బీజేపీకి దక్కాయని లెక్క చెబుతున్నారు.
అవి కూడా ప్రాముఖ్యత కలిగిన పదవులు కాదని అంటున్నారు. ఇక బీజేపీకి ఇస్తున్న పదవులు అన్నీ కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే ఇస్తున్నారు అని అంటున్నారు. దాంతో దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తూ జెండా పట్టుకుని ఉన్న వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదన్న బాధ ఆవేదన వారిలో ఉన్నాయని చెబుతున్నారు.
గట్టిగా మాట్లాడితే నామినేటెడ్ పోస్టులు కేవలం నాలుగైదు మాత్రమే బీజేపీ వారికి ఇచ్చారని అంటున్నారు. ఇక ఆయా పదవులు కూడా బీజేపీలో చేరి వచ్చిన వారికే దక్కడమేంటని గుస్సా అవుతున్నారు. తొలి నుంచి పార్టీలో ఉన్న వారు పూర్తిగా వెనక్కి నెట్టబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం అవౌతోంది.
ఇక పదవుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని కోరుతున్నారు. అయితే చిన్నమ్మ మాత్రం నామినేటెడ్ పదవుల పందేరంలో తన ప్రమేయం లేదని అంతా కేంద్ర నాయకత్వమే చూసుకుంటోంది అని చెబుతున్నారని టాక్. కేంద్ర నాయకత్వం అయితే రాజ్యసభ పదవులు కానీ ఎమ్మెల్సీ కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే ఇస్తోందని ఏపీ బీజేపీ లీడర్లు గుర్తు చేస్తున్నారు.
పురంధేశ్వరి గట్టిగా డిమాండ్ చేస్తేనే బీజేపీకి దక్కాల్సిన నామినేటెడ్ వాటా దక్కుతుందని అంటున్నారు. అయితే చిన్నమ్మ మాత్రం జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. దీంతో ఆమె విషయంలో ఏపీ బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు పోస్టులు దక్కకపోవడానికి చిన్నమే కారణమని వారు నమ్ముతున్నారు. అందుకే చిన్నమ్మ మా మీద దయ చూడమ్మా అని వేడుకుంటున్నారు. మరి చిన్నమ్మ కూటమి పెద్ద బాబుని డిమాండ్ చేసి దండీగా కమలనాధులకు నామినేటెడ్ పదవులు పట్టుకుని వస్తారా అంటే వేచి చూడాల్సిందే.