ఏపీ బీజేపీలో భారీ మార్పులు.. వీర్రాజుతో పేచీలు.. సుజనాకు బాధ్యతలు?

ఏపీ బీజేపీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పురందేశ్వరి మాటకు పార్టీలో ఎంతో ప్రాధాన్యమిచ్చేవారని అంటున్నారు.;

Update: 2025-04-15 23:30 GMT

ఏపీ బీజేపీలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపిన ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి స్థానంలో కొత్తవారికి చాన్స్ వస్తుందని అంటున్నారు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, టీడీపీ, జనసేనతో చక్కని సమన్వయం ఏర్పరిచిన పురందేశ్వరికి కేంద్ర బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన ఉందంటున్నారు. ఇదే సమయంలో ఆమె వర్గాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యతిరేకిస్తుండటం వల్ల పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నట్లు హైకమాండుకు ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. దీంతో పురందేశ్వరి స్థానంలో కొత్తవారిని నియమించి గ్రూప్ వార్ కు పుల్ స్టాప్ పెట్టాలనే అంశాన్ని పార్టీ సీరియస్ గా పరిశీలిస్తోందని చెబుతున్నారు.

ఏపీ బీజేపీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పురందేశ్వరి మాటకు పార్టీలో ఎంతో ప్రాధాన్యమిచ్చేవారని అంటున్నారు. అయితే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు పార్టీలో మళ్లీ యాక్టివ్ అవ్వడంతో గ్రూప్ వార్ మొదలైందని టాక్ వినిపిస్తోంది. అంతవరకు పార్టీలో తమ వాదనను వినిపించేందుకు సరైన నేత లేదని వెనక్కి తగ్గిన అసమ్మతి వాదులు వీర్రాజును తెరపైకి తెచ్చి పురందేశ్వరికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. వాస్తవానికి పురందేశ్వరికి పార్టీలో ఎంతో గౌరవం ఉన్నా, తొలి నుంచి ఉన్న సంఘ్ సేవకుల మాటా వినాల్సిరావడంతో ఆమెను నాయకత్వ స్థానం నుంచి తప్పించాలని డిమాండు వినిపిస్తోందని చెబుతున్నారు.

పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించిన నుంచి ఓ వర్గం వ్యతిరేకిస్తోందని అంటున్నారు. దీంతో ఆమె ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు కొందరు సీనియర్ నేతలు డుమ్మాకొడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులను సీరియస్ గా తీసుకున్న కమలం పెద్దలు ముఠా కుమ్ములాటలను తగ్గించేందుకు కొత్త అధ్యక్షుడిని నియమించడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నారని అంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంతోపాటు పార్టీని బలోపేతం చేయాల్సివుండటంతో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజానా చౌదరిని పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ చేయాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారంటున్నారు. పురందేశ్వరిని తప్పిస్తే ఓ ప్రధాన సామాజికవర్గానికి దూరమయ్యే అవకాశం ఉంటుందనే భయం కూడా సుజనా పేరు తెరపైకి రావడానికి కారణంగా చెబుతున్నారు.

ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన అనుభవం ఉంది. 2014 నుంచి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేసమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తోనూ చనువు ఎక్కువగా చెబుతారు. ఈ పరిస్థితుల్లో సుజనాయే సమర్థుడనే టాక్ వినిపిస్తోంది. ఇక పార్టీకి ఎన్నడూ లేనంత విజయాన్ని అందించడంలో ముందుండి నడిపించిన పురందేశ్వరికి కూడా తగిన స్థానం కల్పించాలని పార్టీ యోచిస్తోందని అంటున్నారు. గ్రూపు వార్ వల్లే పురందేశ్వరికి స్థాన చలనం కల్పించాల్సివచ్చినా, ఆ విషయానికి ప్రాధాన్యం లేకుండా చేయాలని అత్యంత జాగ్రత్తగా పావులు కదుపుతోందని అంటున్నారు.

Tags:    

Similar News