ఏపీ అసెంబ్లీకి 300 సీట్లు...ఎక్కడ తేడా కొట్టింది ?
ఏపీ అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్నవి 175 సీట్లే కదా. మరి 300 సీట్లు ఏమిటి అన్న ప్రశ్న ఎవరికైనా తలెత్తవచ్చు. కానీ అన్ని సీట్లూ ఏపీకి దక్కాల్సిందే అని అంటున్నారు.;
ఏపీ అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్నవి 175 సీట్లే కదా. మరి 300 సీట్లు ఏమిటి అన్న ప్రశ్న ఎవరికైనా తలెత్తవచ్చు. కానీ అన్ని సీట్లూ ఏపీకి దక్కాల్సిందే అని అంటున్నారు. ఇదంతా చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం జరగాల్సిన తంతు అని కూడా చెబుతున్నారు. అయితే ఏపీకి ఇంకా 175 సీట్లే ఉన్నాయని అంటున్నారు. ఈ విషయాలు చెబుతున్నది ఎవరో కాదు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ ఈ రకమైన విశ్లేషణ చేశారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాదికే కాదు ఏపీకి కూడా తీరని అన్యాయం జరుగుతోందని బాబు అది గ్రహించడం లేదని సీపీఎం నేత అంటున్నారు.
విభజన చట్టం ప్రకారం :
నిజానికి చూస్తే డీలిమిటేషన్ కంటే ముందు విభజన చట్టం ప్రకారమే ఏపీకి 175 సీట్లు కాస్తా 225 గా పెంచుకునే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ఆ విషయంలో పట్టుబట్టలేదని విమర్శించారు. ఈపాటికే ఏపీకి 225 సీట్లు పెరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అది కనుక జరిగి ఉంటే డీలిమిటేషన్ ప్రకారం మరో 75 సీట్లు అదనంగా పెరిగేవని చెబుతున్నారు. ఈ విధంగా న్యాయంగానే ఏపీకి 300 సీట్లు దాకా వచ్చేవని ఆయన చెబుతున్నారు.
తప్పుడు వాదన అంటూ :
అయితే చంద్రబాబు మాత్రం డీలిమిటేషన్ మీద తప్పుడు వాదన వినిపిస్తున్నారు అని అన్నారు. విభజన చట్టం ప్రకారం ముందు సీట్లు రాబట్టుకోవాల్సింది వదిలేశారని ఇపుడు బీజేపీ వారి డీలిమిటేషన్ బాగుందని వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. నిజానికి దక్షిణాదికి అన్ని విధాలుగా న్యాయం చేయాలంటే డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళా బిల్లుని ముందు అమలు చేయవచ్చు అని అన్నారు. ఆ తరువాత డీలిమిటేషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 2023 లో మహిళా బిల్లు ఆమోదం పొందితే ఆనాటి నుంచే అమలు చేయమని గతంలో టీడీపీ ఎంపీలు పట్టుబట్టిన విషయం మరచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఇపుడు మాత్రం మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ముడి పెట్టి విపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు అని అన్నారు.
75 సీట్లు పోతున్నాయి :
ఇవన్నీ పక్కన పెడితే విభజన చట్టంలో ఉన్నట్లుగా కొత్తగా 50 సీట్ల పెరుగుదల విషయంలో ఇప్పటిదాకా కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు డీలిమిటేషన్ లో మెలికలు వల్ల ఏపీ 75 సీట్ల దాకా భవిష్యత్తులో కోల్పోయే ప్రమాదం ఉందని సీపీఎం నేత తేల్చారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీకి 225 సీట్లు ఇప్పటికే ఉంటే కచ్చితంగా మరో వంద సీట్లు అయినా అదనంగా పెరిగేవి అన్న చర్చ ఉంది. ఏది ఏమైనా ఏపీ కానీ తెలంగాణా కానీ విభజన చట్టం హామీలను అమలు చేయమని కోరడంలో విఫలం అయ్యాయని అంటున్నారు.