50 సీట్లు కాదు.. మరో 25 పెంచుతారా.. చంద్రబాబు చర్చలు ..?
రాష్ట్రంలో విభజన తర్వాత.. నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లోనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు.;
రాష్ట్రంలో విభజన తర్వాత.. నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లోనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వాస్తవానికి పదేళ్ల కాలంలోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ.. 2011లో జనాభా గణన జరిగిన తర్వాత.. 2021లో జరగాల్సి ఉంది. అయితే.. అప్పట్లో కరోనా నేపథ్యంలో జనాభా గణనను వాయిదా వేశారు. దీంతో రాష్ట్రంలో చేపట్టాల్సిన నియోజకవర్గాల పునర్విభజన అంశం వాయిదా పడింది.
దీనిపై గతంలో టీడీపీ, వైసీపీ నాయకులు కేంద్రం స్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయినా.. వాయిదా పడుతూనే ఉంది. తాజాగా 2026-27 మధ్యలో జనాభా గణన జరగనున్ననేపథ్యంలో 2028 నాటికి నియోజక వర్గాల పునర్విభజన విషయం ఖచ్చితంగా జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే అలెర్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న అంచనాల కంటే కూడా.. మరో 25 స్థానాలు పెంచుకునే దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది.
పాలనను మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకువచ్చేందుకు నియోజకవర్గాల నిడివి తక్కువగా ఉంటేనే బాగుంటుందన్న విషయాన్ని చర్చిస్తున్నారు. వాస్తవానికి గత విభజన చట్టం ప్రకారం.. ఏపీకి 50 అసెంబ్లీ స్థానాలు అదనంగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం. ప్రస్తుతం ఉన్న 175కు మరో 50 జతకలుస్తాయి. మొత్తంగా 225 స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. పెరుగుతున్న నాయకత్వం.. ప్రజల అభిలాషను దృష్టిలో పెట్టుకుని ఈ సంఖ్యను పెంచాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
రాజకీయాల్లోకి వస్తున్న యువతను, అదేసమయంలో ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకు ని నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్నది సీఎం చంద్రబాబు చేస్తున్న ఆలోచన. ఈ నేపథ్యంలో ఆయ న న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నట్టు తెలిసింది. విభజన చట్టం ప్రకారం 50 కొత్త నియోజకవర్గా లతో పాటు.. మరో 25 స్థానాలను పెంచడం ద్వారా.. యువతకు ప్రాధాన్యం పెరగడంతోపాటు.. అందరికీ అవకాశం లభిస్తుందన్న దిశగా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మరి దీనికి కేంద్రం ఓకే అంటే.. 250 స్థానాల అతిపెద్ద రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది.