అటు విజయ్ ను.. ఇటు బీజేపీని.. అన్నామలై ఏసేసుకున్నాడిలా..

అయితే తాజాగా బీజేపీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టిన అన్నామలై పేల్చిన బాంబులు చూసి రాజకీయ విశ్లేషకులు కూడా ఒక్కసారిగా ముక్కున వేలేసుకుంటున్నారు.

Update: 2026-08-17 13:30 GMT

తమిళనాడు రాజకీయాల తీరు ఎప్పుడూ కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే తాజాగా బీజేపీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టిన అన్నామలై పేల్చిన బాంబులు చూసి రాజకీయ విశ్లేషకులు కూడా ఒక్కసారిగా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. ఇటు రాష్ట్రంలోని ‘విజయ్ ప్రభుత్వం’పై అవినీతి బాణాలు విసురుతూనే అటు తానూ భాగమైన కేంద్ర ప్రభుత్వంపై ‘గుజరాత్ ప్రాధాన్యం’ పేరుతో విమర్శల వర్షం కురిపించారు.

మంత్రుల లంచాల పర్వం.. "ఎన్నికల ఖర్చు రికవరీ సీన్"

తమిళనాడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా నితిమంతుడే కావచ్చు.. కానీ ఆయన చుట్టూ ఉన్న కొందరు మంత్రుల వ్యవహారం మాత్రం 'భలే మంచి చౌక బేరం'లా ఉందని అన్నామలై ఎద్దేవా చేశారు. కాంట్రాక్టులు కావాలంటే 2 నుంచి 4 శాతం వరకు 'చందా' లంచం సమర్పించుకోవాల్సిందేనని మంత్రులు డిమాండ్ చేస్తున్నారట. "అయ్యా మొన్నటి ఎన్నికల్లో మేం కోట్లు కుమ్మరించాం.. ఇప్పుడు కాంట్రాక్టుల రూపంలో ఆ డబ్బులు రికవరీ చేసుకోకపోతే ఎలా?" అని సదరు మంత్రులు కాంట్రాక్టర్ల వద్ద ఓపెన్‌గానే మాట్లాడేస్తున్నారట.. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డులు కూడా తమ దగ్గర సిద్ధంగా ఉన్నాయని అన్నామలై వ్యాఖ్యానించడం కోలీవుడ్ డ్రామాను తలపిస్తోంది. పాలనపై పట్టు సడలితే పరిస్థితులు చేజారిపోతాయని.. సీఎం గారు తక్షణమే ఈ 'రికవరీ మంత్రుల'పై చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేంద్రంపైనా విమర్శల బాణం.. "అన్నీ గుజరాత్‌కేనా మరి మా సంగతేంటి?"

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో సరిపెట్టకుండా అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై కూడా సెటైరికల్ బాణాలు విసిరారు. పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర పెద్దలకు గుజరాత్ తప్ప వేరే రాష్ట్రం కనబడటం లేదేమో అన్నట్లుగా మాట్లాడారు. చిన్న వేఫర్స్ కంపెనీల నుంచి భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల వరకు.. ప్రతిదీ అహ్మదాబాద్ లేదా గాంధీనగర్ వైపే రూట్ మ్యాప్ వేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పోనీ ప్రాజెక్టులే అనుకుంటే.. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2030 పోలీస్ గేమ్స్, చివరికి 2036 ఒలింపిక్స్ వరకు ప్రపోజల్స్ అన్నీ గుజరాత్ గడప దాటడం లేదని విమర్శించారు. "దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా స్వామీ.. అందరికీ కాస్త సమాన అవకాశాలు ఇస్తే బాగుంటుంది" అని విన్నవించారు. కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్రస్థాయి నేతలను కూడా భాగస్వాములను చేస్తే 'సమతుల్య అభివృద్ధి' అనే పదానికి అర్థం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఒకే వేదికపై ఇటు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని, అటు కేంద్ర ప్రభుత్వ గుజరాత్ ప్రేమను ఎండగడుతూ అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. మరి ఈ 'ద్విముఖ' విమర్శలపై ద్రవిడ నేతలు, కేంద్ర పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..

Tags:    

Similar News