నాగబాబుకు మంత్రి హోదాతో పదవి...ఆ చాన్స్ ఎవరికి ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబుని ఆయన నియమించారు. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పర్యావరణ, అటవీశాఖ మంత్రిత్వ శాఖల నుంచే ఈ కొత్త పోస్టుని క్రియేట్ చేశారు. ఆ విధంగా నాగబాబుకు సముచితమైన ప్రాధాన్యత కల్పించడంతో పవన్ ఎంతో ముందు చూపు ప్రదర్శించారు అని అంటున్నారు. ఇక ఈ పదవి ద్వారా ఏపీవ్యాప్తంగా పచ్చదనాన్ని విశేషంగా పెంచడమే నాబాబు నాయకత్వంలోని కమిటీ లక్ష్యంగా చెబుతున్నారు.
నాగబాబు నాయకత్వంలో :
ఇక గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ నాగబాబు నాయకత్వంలో పనిచేస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పర్యటించి పచ్చదనం పెంచడానికి పర్యావరణం సమతూల్యతను కాపాడడానికి విశేషంగా కృషి చేస్తుంది. అంతే కాదు ఏపీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈ కమిటీ చూస్తుంది. అలాగే వాటి పర్యవేక్షణ బాధ్యతలను కూడా చూస్తూ ఏపీలో మొక్కల పెంపకం సమృద్ధిగా పకడ్బంధీగా జరిగేలా చూస్తుంది. దీని వల్ల పర్యావరణానికి ఎంతగానో మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. ఒక విధంగా చూస్తే నాగబాబుకు ఇది ఎంతో ముఖ్యమైన బాధ్యతగా చెబుతున్నారు.
మంత్రి వర్గంలో లేనట్లే :
జనసేన అధినేత తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నాగబాబుకు మంత్రివర్గ విస్తరణలో చోటు లేనట్లే అని అంటున్నారు. అదే సమయంలో ఆయన మంత్రిగానే ఉన్నట్లు లెక్క అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదా కాబట్టి ఆయన పదవి పవర్ ఫుల్ గానే ఉంటుందని చెబుతున్నారు. ఇక జనసేనకు ప్రామిస్ చేసిన నాలుగవ మంత్రి పదవికి ఇపుడు ఆశావహులకు మరింతగా అవకాశాలు పెరిగినట్లుగా చెబుతున్నారు. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. అంటే మరో 18 మందిలో ఎవరికి గోల్డెన్ చాన్స్ అన్నదే చర్చగా ఉంది. నిజానికి చూస్తే జనసేన అధినేత ఇపుడు ఆచీ తూచీ పదవుల పంపిణీ చేపడుతున్నారు. నిజానికి తలచుకుంటే నాగబాబు కేబినెట్ లో మంత్రి కావచ్చు. కానీ సామాజిక ప్రాంతీయ సమీకరణలు సరిపోవని అలాగే కుటుంబానికి పెద్ద పీట వేశారు అన్న అపప్రధ వస్తుందని భావించే ఈ విధంగా వ్యూహాత్మకంగా ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమించారని అంటున్నారు. ఇక బీసీలకు జనసేన పెద్ద పీట వేస్తుందని కూడా చెబుతున్నారు. అంతే కాదు ఉత్తరాంధ్రాకు ప్రయారిటీ ఇస్తుందని కూడా ప్రచారం సాగుతోంది.
కొణతాలకే లక్కీ చాన్స్ :
ఈ లెక్కలు సమీకరణలు అన్నీ చూస్తూంటే మంత్రి వర్గ విస్తరణలో జనసేనకు దక్కే కొత్త మంత్రి పదవి ఉత్తరాంధ్రాకు చెందిన కొణతాల రామక్రిష్ణకు దక్కే అవకాశాలు మరింత మెరుగు అయ్యాయని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి జనసేన తరఫున నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే అందులో బీసీ ప్రముఖుడిగా సీనియర్ రాజకీయ నాయకుడిగా కొణతాల ముందు వరసలో ఉన్నారు. దాంతో పాటు ఆయన అనుభవం ఉత్తరాంధ్రా రాజకీయాల మీద ఉన్న పట్టు అన్నీ కలసి మినిస్టర్ చాన్స్ కి దగ్గర చేస్తున్నాయని అంటున్నారు. మొత్తం మీద నాగబాబుకూ మంత్రి హోదా దక్కింది. కొణతాలకూ చాన్స్ లభించనుంది అని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.