ప్రత్యక్ష ఎన్నికలు...టీడీపీ వర్సెస్ వైసీపీగానే !
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగానే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని చూస్తోంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగానే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని చూస్తోంది. ఇదే క్రమంలో ఈసారి ఎన్నికల విధానంలో కీలక మార్పులను తీసుకుని రావాలని భావిస్తోంది. అందులో భాగమే డైరెక్ట్ ఎన్నికలు. అంటే కార్పోరేషన్లలో మేయర్ పదవికి, మునిసిపాలిటీస్ లో చైర్మనలు జెడ్పీ ఎంపీపీ చైర్మన్లకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి అన్న మాట. ప్రజలు నేరుగా తమ ఓటు వేసి వారిని ఎన్నుకుంటారు. దీని వల్ల ఎవరు మేయర్ గా ఉండాలి, ఎవరు జిల్లా పరిషత్తు చైర్మన్ గా ఉండాలి అన్నది ప్రజల చేతిలోనే ఉంటుంది అన్న మాట. నిజానికి ఇది మంచి విధానమే. టీడీపీ గతంలో దీనినే అమలు చేస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ హయాంలో పరోక్ష ఎన్నికల విధానం తీసుకుని వచ్చారు. దీని వల్ల పదవులు అన్నీ అధికారంలో ఉన్న వారే దక్కించుకుని వీలు కలుగుతుంది.
బ్రేకులు వేస్తూ :
అయితే ఇపుడు టీడీపీ కూటమి ఈ విధానానికి బ్రేకులు వేస్తూ డైరెక్ట్ ఎలక్షన్స్ కి పట్టం కడుతోంది. దీని వల్ల తమ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతోంది. అంతే కాదు అవిశ్వాసాలు తరచూ బెదిరింపులు స్థానిక సంస్థలలో అస్థిర రాజకీయాలు క్యాంప్ పాలిటిక్స్ వంటివి ఉండకుండా చెక్ పెట్టొచ్చు అని కూడా భావిస్తోంది. దీని వల్ల కూటమికే ఎక్కువ చాన్స్ అని ఆ పార్టీ పెద్దలు అయితే అంచనా వేస్తున్నారు. అయితే నేతలు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదిగా అంటున్నారు. ఎలా అంటే మేయర్ జెడ్పీ చైర్మన్ వంటి కీలకమైన పదవులకు నేరుగా ఎన్నికలు పెడితే విపక్ష వైసీపీ కూడా రేసులోకి దూసుకుని వస్తుందని అంటున్నారు
వారితో సంబంధం లేదు :
అంతే కాదు వార్డులలో ఎంత మంది నెగ్గారు అన్న దానితో సంబంధం లేదని దాంతో వార్డు పదవులకు పోటీ చేసే వారు కూడా డీలా పడుతారు అని అంటున్నారు. అలాగే మేయర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్ధులు ముందుగా తెలిసిపోవడం వల్ల మిగిలిన వారు ఆశావహులు వారికి ఏ మేరకు సహకరిస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. అసలే మూడు పార్టీలు ఉన్న కూటమిలో గ్రౌండ్ లెవెల్ లో ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి కదా అని గుర్తు చేస్తున్నారు.
వైసీపీ ఓకేనా :
ఇదిలా ఉంటే గ్రౌండ్ లెవెల్ లో సంస్థాగతంగా పట్టున్న పార్టీలు టీడీపీ వైసీపీ మాత్రమే. ఈ విధంగా డైరెక్ట్ ఎన్నికలు పెడితే కనుక వైసీపీ నుంచి పోటీకి సిద్ధపడిన వారు ఎక్కువ మందే ఉంటారు అని అంటున్నారు. ఒకవేళ పరోక్ష పద్ధతి అయితే వైసీపీ గెలుపు ఖాతాను రాసే చాన్స్ చాలా తక్కువ అని అంటున్నారు. ముందుగా వార్డు మెంబర్లను గెలిపించుకోవాలి, ఆ మీదట క్యాంప్ పాలిటిక్స్ చేయాలి, అధికార పార్టీ నుంచి అన్ని విధంగా తట్టుకుని నిలబడాలి, ఇన్ని చేసినా అధికార పార్టీకి ఉండే ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో వారికే గెలుపునకు ఎక్కువ చాన్స్ ఉంటుందని మొదట్లోనే కాడె వదిలేసే వారు అని అంటున్నారు.
గ్రౌండ్ లెవెల్ లో ఉన్న బలం :
ఇపుడు డైరెక్ట్ ఎన్నికలు అంటే కాస్తా ఆర్ధిక బలం ఉన్న వారు అంతా వైసీపీ నుంచి మేయర్ జెడ్పీ చైర్మన్లకు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు అని అంటున్నారు. ఇక కూటమిలో చూసుకుంటే మిత్రుల మధ్య కో ఆర్డినేషన్ సహకారం వంటి వాటి విషయంలో అనుమానాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో ఉన్న బలం చూసుకునే టీడీపీ డైరెక్ట్ ఎన్నికలకు తెర తీసింది అని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ కూడా రంగంలోకి దిగేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని అంటున్నారు. అలా చూసుకుంటే కనుక ఈసారి పోటీ అంతా టీడీపీ వర్సెస్ వైసీపీగానే ఉండబోతోంది అని అంటున్నారు.