మాటలలో మాయ చేస్తున్న లోకేశ్!

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ మంటి మాటకారిగా మారుతున్నట్లు కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Update: 2026-10-01 08:29 GMT

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ మంచి మాటకారిగా మారుతున్నట్లు కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పది మంది దృష్టిని ఆకర్షించేలా ఆయన మాటలతో మాయ చేస్తున్నారని చెబుతున్నారు. విమర్శలను సైతం తనకు అనుకూలంగా మార్చుకునేలా ఆయన చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇండియా టుడే సౌత్ కాన్ క్లేవ్ లో మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. గతంలో లోకేశ్ ను ఇబ్బంది పెట్టిన అనేక అంశాలు కొచ్చి కాంక్లేవ్ లో ప్రస్తావనకు రాగా, మంత్రి లోకేశ్ ఊహంచని విధంగా సమాధానాలు చెప్పి అబ్బురపరిచారని అంటున్నారు.

క్రికెట్ మ్యాచ్ లో పెట్టుబడులు!

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేలా పనిచేస్తున్న తాను ఏ అవకాశం వదులుకునేందుకు సిద్ధంగా లేనని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గతంలో క్రికెట్ చూసేందుకు వెళ్లిన సమయంలో కూడా పారిశ్రామిక వేత్తలను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చిన సంఘటనలు ఉన్నాయని చెప్పారు. ప్రజాధనం వృధా చేస్తూ, ప్రజల డబ్బుతో లోకేశ్ సరదాలు తీర్చుకుంటున్నారని గతంలో విపక్షం వైసీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఈ విమర్శలపై స్పందించని లోకేశ్ తాజాగా జాతీయ మీడియా వేదికగా తన గళాన్ని విప్పారు. మంత్రిగా బిజీగా ఉంటూ క్రికెట్ చూడటానికి వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నకు లోకేశ్ దీటైన సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. నేను ఎప్పుడూ ఏబీసీ.. అల్వేస్ బీ క్లోజింగ్ అని నమ్ముతాను. ఎప్పుడూ ఒక అవకాశాన్ని ముగింపునకు తీసుకువెళ్లాలి. క్రికెట్ చూసేందుకు వెళ్లినా అక్కడ కూడా పెట్టుబడి ఒప్పందాలపై మాట్లాడి ముగిస్తాను అని చెప్పుకొచ్చారు. ఒక టీ20 మ్యాచులో ఎంతమంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలను కలిశానో చెబితే ఆశ్చర్యపోతారని అన్నారు.

ఇక ముఖ్యమంత్రి పదవిపై జరుగుతున్న ప్రచారాన్ని ముగించేలా ఈ వేదికను లోకేశ్ ఉపయోగించుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం లేదని, తాను విద్యామంత్రిగా ప్రస్తుత విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయమై మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను గమనిస్తే మంత్రి లోకేశ్ రాజకీయ పరిణతితో వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారని అంటున్నారు. సీనియర్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన వేరే ఏ విధమైన సమాధానం చెప్పినా రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఉండేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజకీయంగా సున్నితమైన ప్రశ్న ఎదురైనప్పుడు దానిపై డిబేట్ కొనసాగేలా మాట్లాడకుండా, విషయాన్ని దారి మళ్లించి లోకేశ్ సేఫ్ గా బయటపడ్డారని అంటున్నారు.

మొత్తానికి గతంలో బహిరంగ వేదికలపై సరిగా మాట్లాడలేక, కొన్ని పదాలను సరిగా పలకలేక ఇబ్బంది పడిన లోకేశ్ లో ఇప్పుడు ఆ సమస్య కనిపించడం లేదని అంటున్నారు. ఏ విషయాన్ని అయినా సమగ్రంగా చర్చించడమే కాకుండా, ఆకట్టుకునేలా సమాధానాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారని అంటున్నారు. మంచి వ్యాఖ్యాతగా కూడా మారుతున్నారని, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని చెబుతున్నారు. రాజకీయ నాయకుడిగా వంద శాతం రాణించాలనే లక్ష్యంతో తన శరీర ఆకృతిని మార్చుకున్నట్లే.. ఇప్పుడు భాషను కూడా మెరుగుపరచుకునేలా దృష్టి పెట్టారని అంటున్నారు. దీంతో ఎటువంటి క్లిష్ట సమస్యలు, కఠిన పరిస్థితులు ఎదురైనా నేర్పుగా, ఓర్పుగా సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News