పంజాబ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఔట్ !

శాసనసభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2026-10-01 07:41 GMT

శాసనసభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అధ్యక్ష పదవి రేసులో విజయ్ ఇందర్ సింగ్లా ముందున్నారు. పరగత్ సింగ్, సుఖ్వీందర్ సింగ్ రంధవా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న వర్గపోరు నేపథ్యంలో ఈ రాజీనామా చోటు చేసుకుంది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు తన రాజీనామా లేఖను పంపించినట్లు తెలుస్తోంది.

గత జులైలో అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని క్యాంపెయిన్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించిన తరువాత పార్టీలో వర్గ విభేదాలు పెరిగాయి. చన్నీ మద్దతుదారులు రధవా మద్దతు దారులతో కలిసి వార్రింగ్ ను పదవి నుండి తప్పించాలని కోరుతూ వస్తున్న నేపథ్యంలో పంజాబ్ ఇంచార్జిగా వచ్చిన సచిన్ పైలట్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ ఈ మేరకు అధ్యక్షుడిని తప్పించాలని నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ శాసనసభ ఎన్నికలు వచ్చే నవంబర్ లేదా 2027 ఫిబ్రవరిలో జరుగుతాయి అని భావిస్తున్నారు. ప్రస్తుత శాసనసభ పదవీకాలం వచ్చే మార్చి నాటికి ముగియనుంది. ఎన్నికలకు ముందు పార్టీలో ఐకమత్యం తీసుకురావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. ఇప్పటికే అక్కడ బలంగా ఉన్న వర్గ పోరు నేపథ్యంలో వార్రింగ్ క్యాంప్, చన్నీ, రంధావా క్యాంపులుగా పార్టీ విడిపోయింది. ఇప్పుడు వార్రింగ్ ను పదవి నుండి తప్పించిన నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలలో 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైంది. రాజీనామాలు, ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం 16 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయింది. గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 13 లోక్ సభ స్థానాలకు గాను ఏడు స్థానాలను గెలుచుకుంది. 26 శాతం ఓట్ షేర్ సంపాదించింది. అయితే ఈ ఎన్నికల్లో విజయానికి అంతర్గత పోరు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

పంజాబ్ లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అధికారం చేజిక్కించుకోవాలంటే 59 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే ఈ మొత్తం శాసనసభ స్థానాలలో 34 ఎస్సీ రిజర్వ్డ్ కావడం గమనార్హం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో జాట్ సిక్, దళిత, హిందూ ప్రాతినిధ్యం చుట్టూ విభేదాలు కొనసాగుతున్నాయి. సాంప్రదాయక గ్రామీణ ఓటర్లు, చన్నీ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో 32 శాతం ఉన్న దళితులు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. జాత్ - దళిత - హిందూ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ రాజీనామా ఏ పరిణామాలకు దారి తీస్తుంది ? కాంగ్రెస్ వ్యూహాలు విజయవంతం అవుతాయా? లేదా ? వేచి చూడాలి.

Tags:    

Similar News