'ఫాం-6' పై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం!
ఈ నేపథ్యంలో తన తప్పును తెలుసుకుందో ఏమో.. ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
కొత్తగా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అత్యంత కీలకమైన `ఫాం-6` విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచ లన నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకు తీవ్ర వివాదంగా మారిన ఈ వ్యవహారంపై తాజాగా యూటర్న్ తీసుకుంది. `ఫాం-6`ను సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పూర్తయిన రాష్ట్రాల్లో ఎలాంటి అఫిడవిట్లు లేకుండానే దాఖలు చేయొచ్చని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాం-6ను నమోదు చేసుకునే అవకాశం ఏర్పడింది.
ఏంటి వివాదం..
ఫాం-6.. అనేది కొత్తగా ఓటు హక్కు కోసం ఇచ్చే దరఖాస్తు లాంటిది. తాజాగా సర్ ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో చాలా మంది తమ హక్కును కోల్పోయారు. 2002 నాటి ఓటరు జాబితాలో తమ కుటుంబీకుల పేర్లు లేకపోవడం.. లేదా అడ్రస్ ఛేంజ్ కావడంతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా ఓటు హక్కును కోల్పోయారు. దీనిపై పెద్ద ఎత్తు న వివాదం రేగింది. ఈ క్రమంలో మీరంతా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. అని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో వారంతా ఫాం-6 కింద నమోదు చేసుకునేందుకు రెడీ అయ్యారు.
అయితే.. ఇక్కడే ఎన్నికల సంఘం మెలిక పెట్టింది. కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే వారు కూడా.. 2002లో ఉన్న జాబితాలను అనుసరించి.. తమ కుటుంబీకులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి ఇవ్వాలని మెలిక పెట్టింది. అయితే.. వాస్తవానికి ఇది లేదనే కదా.. తొలగించారు... అనేది మౌలిక ప్రశ్న. అయినప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గలేదు. ఇక, దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘంపై దుమారం రేగడం.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో తన తప్పును తెలుసుకుందో ఏమో.. ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఫాం-6ను ఇప్పుడు ఎలాంటి డిక్లరేషన్ అఫిడవిట్ లేకుండానే దాఖలు చేసుకునేలా అవకాశం ఇచ్చింది. అంటే.. సర్ ప్రక్రియలో ఓటు పోయినా.. ఇప్పుడు అలాంటి వారు తిరిగి కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకుని.. ఓటు హక్కును పొందవచ్చు. మొత్తానికి దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎందుకు డిక్లరేషన్ నిబంధన పెట్టారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఎత్తేశారని.. ఇది లోప భూయిష్ట నిర్ణయమని అంటున్నారు.