త్రిష చుట్టూ తమిళ రాజకీయం.. మరోసారి ఏఐడీఎంకే హాట్ కామెంట్స్

రాజకీయాలకు సంబంధం లేకపోయినా, తమిళ రాజకీయాలు మొత్తం ప్రముఖ నటి త్రిష చుట్టూనే తిరుగుతున్నాయి.

Update: 2026-08-17 09:57 GMT

రాజకీయాలకు సంబంధం లేకపోయినా, తమిళ రాజకీయాలు మొత్తం ప్రముఖ నటి త్రిష చుట్టూనే తిరుగుతున్నాయి. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రిషను వీవీఐపీగా పరిగణించడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ విషయంపై ఏఐడీఎంకే సీనియర్ నేత ఉదయకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడుకు పట్టిన శాపం అంటూ త్రిషపై ఘాటు విమర్శలు గుప్పించారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి దళపతి విజయ్ ని లక్ష్యంగా చేసుకుని విజయ్ కి ప్రియమైన త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారో చూడాలని తమిళనాడు ఎదురుచూస్తోంది అంటూ ఉదయకుమార్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ కామెంట్లు మరచిపోకముందే త్రిష తమిళనాడుకు పట్టిన శాపం అంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉదయకుమార్.

ఇక సినీ నటి త్రిషపై ఏఐడీఎంకే నేత ఉదయకుమార్ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకపోయినా విపక్ష పార్టీల నేతలు త్రిషను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయంలో విపక్షంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పోటీ పడుతున్నట్లు ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సైతం త్రిషపై అభ్యంతరకర విమర్శలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే కూడా తగ్గేదేలే అన్నట్లు త్రిషపై మాటల దాడి చేయడం తమిళ రాజకీయాల్లో కలకలంగా మారింది.

ఆగస్టు 15 వేడుకలు సందర్భంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, నటి త్రిష ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రులతో కలిసి స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జెండా ఆవిష్కరణకు వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ పోలీసు గౌరవందనం స్వీకరిస్తూ వీవీఐపీ గ్యాలరీలో కూర్చుకున్న త్రిషకు సెల్యూట్ చేయగా, ఆమె కూడా సెల్యూట్ చేస్తున్నట్లు ఫోజులిచ్చిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేశాయి. అదేవిధంగా మే నెలలో విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష హాజరయ్యారు. ఇక అప్పటి నుంచి విపక్షాలకు ఆమె అస్త్రంగా మారారని చెబుతున్నారు.

ఎన్నికల ముందు కూడా త్రిషపై గురిపెట్టి టీవీకే అధినేత విజయ్ ని ఎదుర్కోవాలని రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. విజయ్ ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలనే వివాదాస్పద విమర్శలు సైతం ఆ ఎన్నికల్లో వినిపించాయి. ప్రధానంగా విజయ్, త్రిష మధ్య ఏదో సంబంధం ఉందన్న విధంగా ప్రచారం చేయాలని ప్రత్యర్థులు భావిస్తే, ప్రజలు మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా విజయ్ పార్టీ టీవీకేకు ఘన విజయం కట్టబెట్టారు. అయినప్పటికీ విజయ్ ప్రత్యర్థుల ఆలోచనల్లో మార్పు రాలేదని తాజాగా త్రిషపై చేస్తున్న విమర్శల బట్టి అర్థమవుతోందని అంటున్నారు.

Tags:    

Similar News