మోడీ యంగ్ కేబినెట్...వారికి చెక్ పెడతారా ?

జెన్ జీ జ్వరంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వేడెక్కిపోతున్నాయి. జెన్ జీ అని తలచుకుంటేనే ఉలికిపడే పరిస్థితి ఉంది.

Update: 2026-08-17 07:04 GMT

జెన్ జీ జ్వరంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వేడెక్కిపోతున్నాయి. జెన్ జీ అని తలచుకుంటేనే ఉలికిపడే పరిస్థితి ఉంది. వారికి హద్దులు లేవు, అదుపు లేదు, ఒక్క సోషల్ మీడియా కాల్ ఇస్తే చాలు వేలు లక్షలుగా ఒక్కసారిగా గుమిగూడతారు, రోజుల తరబడి ఆందోళనలకు కూడా వారు ఎంత తయారుగా ఉన్నారో ఇటీవల ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ వేదిక రుజువు చేసింది. వారు ఎంత పవర్ ఫుల్ అన్నది కేంద్ర మంత్రి రాజీనామా కళ్ళకు కట్టింది. బలమైన ప్రభుత్వం ఏదైనా తమ డిమాండ్లు నెగ్గించుకునే సత్తా జెన్ జీలకు ఉందని చాటి చెప్పే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాంతో ఇపుడు అధికార విపక్షాలే కాదు అన్ని పక్షాలు కూడా జెన్ జీ నామ స్మరణే చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జాతీయ జెండా పండుగ వేళ ఎర్ర కోట నుంచి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో కూడా ఎక్కువగా యువ జపమే చేశారు. మరి యువత గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్న బీజేపీ తన కేబినెట్ లో ఎంత మంది యువతకు చోటిచ్చింది అన్నది ఇపుడు పెద్ద ప్రశ్నగా చర్చగా ముందుకు వస్తోంది.

సగటు వయసు ఎంత :

మోడీ కేబినెట్ లో మొత్తం 72 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో సీనియర్లు జూనియర్లు అందరూ కలిసి ఉన్నారు. మోడీ కేబినెట్ సగటు వయసు ఎంత అన్నది కూడా ఇపుడు తరచి చూస్తున్నారు. అయితే మోదీ 3.0 మంత్రివర్గంలో ప్రధానితో కలిపి మొత్తం 72 మంది మంత్రుల సగటు వయసు సుమారు 58 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంది. అంటే ఒక విధంగా ఇది సీనియర్ల కేబినెట్ అనే అంటున్నారు. ఇక ఎక్కువ మంది సీనియర్లకు చోటి స్తూనే కొంత మంది యువ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ఈ మంత్రివర్గాన్ని 2024లో కూర్పు చేశారు. ఇక మోడీ కేబినెట్‌లో కింజరాపు రామ్మోహన్ నాయుడు, రక్షా ఖడ్సే వంటి 30-40 ఏళ్ల వయసు గల యువ నాయకులు కొంత మంది ఉన్నారు. అదే విధంగా చూస్తే మధ్య వయస్కుల జాబితాలో సుమారు 66 శాతం మంది మంత్రులు అంటే 47 మంది ఉన్నారు. ఇక 51 నుండి 70 సంవత్సరాల వయసు కలిగిన వారిలో జీతన్ రామ్ మాంఝీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి సీనియర్ నాయకులు కూడా ఈ కేబినెట్‌లో సేవలందిస్తున్నారు. మోడీ వయసు చూస్తే 76 ఏళ్ళుగా ఉంది. మరి యువతను ఆకట్టుకోవాలంటే వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి కదా అన్న అభిప్రాయం ఇపుడు ముందుకు వస్తోంది.

విస్తరణలో భారీ మార్పులు :

ఇక దేశంలోని యువత వ్యవస్థలలో మార్పులను కోరుకుంటోంది. అలాగే కొత్తదనాన్ని కూడా కోరుకుంటోంది. దాంతో వారి ఆలోచనలకు అనుగుణంగా మోడీ కేబినెట్ విస్తరణ జరిగినపుడు అవకాశాలు ఇస్తారా అన్నదే చర్చగా ఉంది. యంగ్ కేబినెట్ గా మోడీ జనం ముందుకు వస్తారా వస్తే ఎలా ఉండొచ్చు అన్నది మరో టాపిక్ గా చూడాల్సి ఉంది. సీనియర్ల అనుభవం అవసరమె కానీ అంతా వారే ఉంటే దేశంలో నూటికి అరవై శాతం ఉన్న యువతకు ఏ విధంగా సందేశం వెళ్తుంది, ఏ విధంగా వారితో కనెక్ట్ అవుతుంది అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇక మోడీ కానీ ఎన్డీయే పెద్దలు కానీ యూత్ ని ఆకట్టుకోవాలని చూస్తున్న క్రమంలో వారికి మరింతగా అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. యువతతో కనెక్ట్ కావాలంటే యువతరమే ముందు ఉంటేనే కుదురుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికే కేంద్రంలో పలువురు సీనియర్లని పార్టీ కోసం కేటాయించి కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని మోడీ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇపుడు యంగ్ జనరేషన్ అసంతృపితో ఉన్న వేళ వారిలో ఆశలను పెంచే విధంగా మోడీ ప్రభుత్వం కూడా యువత కళను సంతరించుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. అదే జరిగితే మోడీ ప్రభుత్వంలో యువతకు ఈసారి పెద్ద ఎత్తున అవకాశాలు దక్కే వీలు ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉన్నది అన్నది.

Tags:    

Similar News