తెలుగు రాష్ట్రాలపై దళపతి విజయ్ కన్ను? ఆసక్తికరంగా తమిళనాడు ప్రభుత్వ ప్రకటనలు!
ఏపీ, తెలంగాణల్లోని కొన్ని ప్రధాన పత్రికలకు తమిళనాడు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది.
తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీ సూపర్ స్టార్, దళపతి విజయ్ తన నెక్ట్స్ టార్గెట్ గా తెలుగు రాష్ట్రాలను ఎంచుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. తన రాజకీయ ప్రయాణం తమిళనాడుకే పరిమితం చేయకుండా జాతీయస్థాయికి ఎదగాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్ అందుకు తగినట్లు అడుగులు వేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ వాదనకు బలం చేకూర్చేలా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పత్రికల్లో తమిళనాడు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడాన్ని ఉదహరిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా దళపతి విజయ్ ప్రభుత్వం పత్రికలకు భారీ ప్రకటనలు ఇచ్చింది. ఇలా ప్రభుత్వ విజయాలను ప్రకటలు ద్వారా పత్రికల్లో ప్రచురించడం సహజమే అయినప్పటికీ తమిళనాడు సరిహద్దులు దాటి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలో ప్రకటనలు జారీ చేయడమే అనేక సందేహాలకు తావిస్తోందని అంటున్నారు.
ఏపీ, తెలంగాణల్లోని కొన్ని ప్రధాన పత్రికలకు తమిళనాడు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఏ ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రచారం చేసిందనేది హాట్ టాపిక్ అవుతోంది. సినీ నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా కూడా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకోవాలని భావిస్తున్నారా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌కు తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా కోట్ల సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం సినిమా నటుడిగానే కాకుండా, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడంతో తన నాయకత్వ ప్రభావాన్ని, ప్రతిష్టను పొరుగు రాష్ట్రాలకూ చాటుకునే ప్రయత్నంలో వ్యూహాత్మకంగా ఈ ప్రకటనలు జారీ చేసివుంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదేసమయంలో విజయ్ ప్రభుత్వ ప్రకటనలకు రాజకీయానికి సంబంధం ఉండదనే వాదన కూడా వినిపిస్తుంది. తమిళ, తెలుగు ప్రజలకు సంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని, ఆ భావోద్వేగాన్ని కొనసాగించేందుకు తెలుగు రాష్ట్రాల్లో తన ప్రభుత్వ ప్రగతిని చాటుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. తమిళనాడులో తెలుగు ఓటర్లు కూడా గణనీయంగా ఉండటం, వారికి ఇక్కడి వారితో బంధుత్వాలు ఉండటం వల్ల తన పాలనపై సానుకూల చర్చ జరిగాలనే ఆలోచన కూడా ఉండొచ్చని అంటున్నారు. ఇదే సమయంలో తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో తెలుగు ప్రజలను ఆకర్షించి పర్యాటకాభివృద్ధికి బాటలు వేయాలనే ప్లాన్ కూడా చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.
మరోవైపు పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని, ఈ పోటీలో తాను ఉన్నానని చాటుకోడానికి ఇక్కడి పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించడానికి కూడా దళపతి విజయ్ ఈ విధంగా తెలుగులో వంద రోజుల విజయంపై ప్రకటనలు జారీ చేశారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, తమ రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటకం లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఇతర రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు మీడియా మార్కెటింగ్‌లో భాగంగా కూడా ఇలాంటి ప్రకటనలు ఇచ్చి ఉండవచ్చునని అంటున్నారు.