భారతీయ రెపరెపలు.. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థకు అధిపతిగా భారతీయుడు!

ఈ బాధ్యతల్లో ఉన్న పనోస్‌ పనయ్‌ గతేడాది అమెజాన్‌ కు వెళ్లడంతో ఆయన స్థానంలో పవన్‌ దావులూరి నియమితులయ్యారు.

Update: 2024-03-27 05:08 GMT

భారతీయ టెకీలు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దిగ్గజ సంస్థలు గూగుల్‌ కు సీఈవోగా సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదెళ్ల కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే మరో ప్రముఖ సంస్థ అడోబ్‌ కు శంతను నారాయణ్‌ సీఈవోగా ఉన్నారు. ఇలా ఎంతో మంది టెకీలు ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తారు.

తాజాగా మరో భారతీయుడు కీలక పదవి దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ విండోస్, సర్ఫేస్‌ కు కొత్త అధిపతిగా ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి ఎంపికయ్యారు. ఈ బాధ్యతల్లో ఉన్న పనోస్‌ పనయ్‌ గతేడాది అమెజాన్‌ కు వెళ్లడంతో ఆయన స్థానంలో పవన్‌ దావులూరి నియమితులయ్యారు.

కాగా విండోస్, సర్ఫేస్‌ గ్రూప్‌లను విడదీసి, వాటికి వేర్వేరు అధిపతులను మైక్రోసాఫ్ట్‌ నియమించింది. సర్ఫేస్‌ కు పవన్‌ దావులూరి, విండోస్‌ విభాగానికి మైఖేల్‌ పరాఖిన్‌ అధిపతులుగా ఉన్నారు. అయితే పరాఖిన్‌ వేరే అవకాశాలను వెతుక్కొనే పనిలో ఉండటంతో విండోస్, సర్ఫేస్‌.. రెండు విభాగాల బాధ్యతలనూ పవన్‌ దావులూరికే అప్పగించారు.

పవన్‌ మైక్రోసాఫ్ట్‌ కార్పొరేట్‌ ప్రొడక్ట్‌ చీఫ్‌ గా వ్యవహరించనున్నారు. 23 ఏళ్లుగా ఆయన మైక్రోసాఫ్ట్‌లోనే పనిచేస్తున్నారు.

Read more!

అమెరికా టెక్‌ దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌ లకు నాయకత్వ హోదాలో పనిచేస్తున్న భారతీయ సంతతి వ్యక్తులైన సుందర్‌ పిచాయ్, సత్య నాదెళ్ల తదితరుల సరసన పవన్‌ దావులూరి కూడా తాజా నియామకంతో చేరారు. నేరుగా మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లకే దావులూరి పవన్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

పవన్‌ దావులూరి ఐఐటీ మద్రాస్‌ లో ఇంజనీరింగ్‌ చేశాక యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌ లో రిలయబిలిటీ కాంపోనెంట్‌ మేనేజర్‌ గా బాధ్యతలు చేపట్టారు.

కాగా గతేడాది మైక్రోసాఫ్ట్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా భారతీయ అమెరికన్‌ మహిళ.. అపర్ణ చెన్నప్రగడ నియమితులయిన సంగతి తెలిసిందే. టెక్‌ పరిశ్రమలో ఆమెకు విశేష అనుభవముంది. ఈ నేపథ్యంలో ఆమెకు కీలకమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ విభాగం బాధ్యతలు అప్పగించారు.

ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్‌ లో ఇంజనీరింగ్‌ చదివిన అపర్ణకు ప్రొడక్ట్‌ డెవలప్మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది. గతంలో ఆమె గూగుల్‌ లో ఆమె సుమారు 12 ఏళ్లు విధులు నిర్వర్తించారు.

ఈ క్రమంలో ఇప్పుడు మద్రాస్‌ ఐఐటీ పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి కూడా మైక్రోసాఫ్ట్‌ లో కీలక బాధ్యతలు దక్కించుకోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News