వారెవ్వా.. ఏం డైలాగ్‌ కొట్టావయ్యా అనీలూ!

ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు వీర విధేయుల్లో ఒకరు.. అనిల్‌ కుమార్‌ యాదవ్‌.

Update: 2024-02-21 09:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు వీర విధేయుల్లో ఒకరు.. అనిల్‌ కుమార్‌ యాదవ్‌. జగన్‌ ను ఎవరైనా ఏమైనా అంటే వారిపై తిట్లతో విరుచుకుపడేవారిలో అనిల్‌ ఒకరని చెబుతారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌ ను ఈసారి జగన్‌ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

2009లో వందల ఓట్ల తేడాతోనే ఓడిపోయిన అనిల్‌ 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. జగన్‌ పట్ల ఉన్న విధేయతతోనే నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చాన్సు దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని జగన్‌ ఆదేశించడంతో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం అక్కడ చురుగ్గా పర్యటిస్తున్నారు.

నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గమంతా చురుగ్గా పర్యటిస్తున్న అనిల్‌ కుమార్‌ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. స్థానిక వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బీసీ ద్రోహి అని అనిల్‌ విమర్శించారు. నరసరావుపేట టికెట్‌ ఈసారి బీసీలకు ఇస్తున్నాం.. మీరు గుంటూరు నుంచి పోటీ చేయాలని లావుకు సీఎం జగన్‌ చెప్పారన్నారు. అయితే ఇందుకు ఇష్టపడని లావు టీడీపీలో చేరుతున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్‌ కోసం తాను తల తెగ్గోసుకుంటానని తాజాగా అనిల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానని తెలిపారు. తాను ఓడిపోతానా, గెలుస్తానా అనే పట్టింపులు లేవని.. జగనన్న ఏం చెప్తే అది చేయడమే తన పని అని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని అయిన తనను గెలిపిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటానన్నారు.

Read more!

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం జగన్‌ తోనే సాధ్యమని అనిల్‌ పునరుద్ఘాటించారు. తనకు సీటు ఇవ్వకపోయినా బాధపడేవాడిని కాదన్నారు. సీట్లు రాలేదని కొందరు, వేరే చోట సీటు ఇచ్చారని కొందరు పార్టీ మారుతుండటంపై మండిపడ్డారు. ఇలా చేయడం సరికాదన్నారు.

తాను తల తెగుతుందన్నా సరే జగనన్న కోసం ముందుకే వెళ్తానని.. వెనకడుగు వేయనని తెలిపారు. జగన్‌ కోసం రామబంటులా పనిచేస్తానని అనిల్‌.. జగన్‌ పట్ల తన విధేయతను చాటుకున్నారు. పల్నాడు జిల్లా ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. దీంతో నెల్లూరు సిటీని వదిలివచ్చానన్న బాధ పోయిందన్నారు. జగన్‌ ఒక్కడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయని ధ్వజమెత్తారు.

కాగా అనిల్‌ కున్న ఈ వీర విధేయతతోనే నెల్లూరు సిటీలో అనిల్‌ సూచించిన అభ్యర్థికే జగన్‌ సీటు ఇచ్చారు. నెల్లూరు కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ గా ఉన్న ఖలీల్‌ కు సీటు ఇవ్వాలని అనిల్‌ కోరడంతో జగన్‌ ఆయనకే సీటు ఇచ్చారు. వైసీపీకి ఆర్థికంగా మూలస్తంభంలా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాటను కూడా ఈ విషయంలో జగన్‌ లెక్కచేయలేదని వార్తలు వచ్చాయి. వేమిరెడ్డి తన సతీమణి ప్రశాంతికి నెల్లూరు సిటీ సీటును అడిగినా జగన్‌ ఇవ్వలేదు. తన వీర విధేయుడు అనిల్‌ సూచించిన వ్యక్తికే సీటు ఇచ్చారు.

4
Tags:    

Similar News