భారత్ లో జననం.. యూఎస్ లో మరణం.. కుమారుడి కోసం తండ్రి దాతృత్వం వైరల్!
ప్రమాదంలో గాయాల నుండి కోలుకుంటున్న సమయంలో తన 49 ఏళ్ల కుమారుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడని తెలిపారు.;
తన కుమారుడి ఆకస్మిక మరణంతో గుండేల నిండా వేదన నింపుకున్న తండ్రి.. కుమారుడికి ఇచ్చిన మాట, అతని చివరి కోరిక.. ఈ మేరకు తండ్రిగా తాను చేసిన ప్రతిజ్ఞను పునరుద్ధరించారు. తన కుమారుడి మరణం.. తమ జీవితంలో అత్యంత చీకటి రోజు అని అభివర్ణించిన ఆ పెద్ద మనసున్న మనిషి.. తాము సంపాదించిన దానిలో 75% కంటే ఎక్కువ సమాజానికి తిరిగి ఇచ్చేస్తానని ఇచ్చిన హామీని వెళ్లడించారు! ఆ మొత్తం సుమారు రూ.25,000 కోట్లని తెలుస్తోంది.
అవును... అమెరికాలో తన కుమారుడు అగ్నివేష్ ఆకస్మిక మరణం తరువాత, బిలియనీర్ పారిశ్రామికవేత్త, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తన సంపదలో 75% కంటే ఎక్కువ సమాజానికి విరాళంగా ఇస్తానని తన దీర్ఘకాల ప్రతిజ్ఞను పునరుద్ధరించారు. ప్రమాదంలో గాయాల నుండి కోలుకుంటున్న సమయంలో తన 49 ఏళ్ల కుమారుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడని తెలిపారు. న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అగ్నివేష్ మరణించారు.
ఈ సందర్భంగా... నాకు అతను కొడుకు మాత్రమే కాదు.. అతను నా స్నేహితుడు.. నా గర్వం.. నా ప్రపంచం అని అన్నారు. ఇదే సమయంలో క్రీడాకారుడిగా, సంగీతకారుడిగా, నాయకుడిగా, విశ్వసనీయ సహోద్యోగిగా పేరుగాంచాడని అగర్వాల్ అన్నారు. ఏ బిడ్డా ఆకలితో నిద్రపోకూడదని.. ఏ బిడ్డకూ విద్య నిరాకరించబడకూడదని.. ప్రతి స్త్రీ తన కాళ్లపై తాను నిలబడాలని.. ప్రతి యువ భారతీయుడికి అర్థవంతమైన పని ఉండాలని తాము కలలు కన్నామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే... మనం సంపాదించిన దానిలో 75% కంటే ఎక్కువ సమాజానికి తిరిగి ఇస్తామని తాను అగ్నివేష్ కి హామీ ఇచ్చానని చెప్పిన అగర్వాల్... ఈ రోజు నేను ఆ వాగ్దానాన్ని పునరుద్ధరించి, మరింత సరళమైన జీవితాన్ని గడపాలని సంకల్పించుకున్నాను అని అన్నారు. "నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా నడవాలో నాకు తెలియదు, కానీ నేను నీ వెలుగును ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను" అని తన కొడుకుకు రాసిన చివరి సందేశంలో అగర్వాల్ రాశారు.
కాగా... 1976 జూన్ 3న బీహారీ మధ్య తరగతి కుటుంబానికి పాట్నాలో జన్మించారు. ఈ క్రమంలో విజయవంతమైన వృత్తిపరమైన ప్రయాణాన్ని కొనసాగించారు. మయో కాలేజీలో చదువు అనంతరం లోహాల వ్యాపారంలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటైన ఫుజీరా గోల్డ్ ను స్థాపించారు. ఇదే క్రమంలో.. హిందుస్థాన్ జింక్ కు ఛైర్మన్ గానూ పనిచేశారు.
ఇక... ఫోర్బ్స్ నివేదికల ప్రకారం అనిల్ అగర్వాల్ కుటుంబ నికర ఆస్తి విలువ సుమారు 4.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు) ఉంటుండగా... ఇందులో 75% పైన ఆయన దానం చేయనున్నారు. అంటే సుమారు రూ.25,000 కోట్లు దానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కుమారుడికి ఇచ్చిన మాట కోసం ఇంత విషాద సమయంలోనూ ఈ తండ్రి చూపిస్తున్న చొరవ, చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడిన విధానం భారీ ప్రశంసలు అందుకుంటుంది.