మంత్రివర్గ నిర్ణయాలలో జనసేన ప్రభావం లేదా ?

అయితే పవన్ కీలకమైన సమావేశాలలో పాలుపంచుకోకపోవడం పట్ల జనసేన వర్గాలతో పాటు అభిమానులలోనూ చర్చ సాగుతోంది.;

Update: 2025-04-16 03:15 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే తెలుగుదేశం, జనసేన బీజేపీ పార్టీలు ప్రభుత్వాన్ని కలసి నడుపుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పెద్దన్నగా కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారు. కానీ అదే కూటమి సర్కార్ లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. జనసేనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. మొత్తం కేబినేట్ లో జనసేన 12 శాతం వాటాను కలిగి ఉంది.

ఇక ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యతతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రతీ ప్రభుత్వ ఆఫీసులో సీఎం తో పాటు ఆయన ఫోటో కూడా ఉంటోంది. ఈ ప్రభుత్వాన్ని బాబు పవన్ ఇద్దరూ కలసి నడిపిస్తున్నారు అని అంతా అనుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉంటారని భావించే ఎన్నికల్లో జనాలు కూటమికి భారీ మెజారిటీ ఇచ్చి జై కొట్టారు. చూడబోతే కేబినెట్ నిర్ణయాలలో జనసేన ప్రభావం ఏమిటి అన్నది తెలియడం లేదు అని అంటున్నారు.

మంత్రివర్గం ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుంది అని ఆలోచించి నిర్ణయాలు చేస్తుంది. అలా జనసేన ముద్ర కూడా ఉండాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అయితే వరసగా మూడు మంత్రివర్గ సమావేశాలకు గైర్ హాజరు అయ్యారు కారణాలు ఏమి అయినప్పటికీ పవన్ మాత్రం కేబినెట్ భేటీకి దూరంగా ఉంటున్నారు. ఇక తాజాగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ హైదరాబాద్ నుంచి వచ్చారు.

అయితే ఆయనకు తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా మళ్ళీ వెళ్ళిపోయారు అని అంటున్నారు. అయితే పవన్ కీలకమైన సమావేశాలలో పాలుపంచుకోకపోవడం పట్ల జనసేన వర్గాలతో పాటు అభిమానులలోనూ చర్చ సాగుతోంది. తమ నాయకుడు కూడా ప్రాధాన్యత కలిగిన సమావేశాలలో పాల్గొని ప్రజల కోసం మేలైన నిర్ణయాలను తీసుకోవాలని అంతా ఆశిస్తున్నారు.

ఇక ఇటీవల రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. దానికి కూడా పవన్ హాజరు కాలేదు. మరి ఈ విధంగా చేస్తే జనసేన ప్రభుత్వంలో ఉండి ఏమి చేసింది అంటే జవాబు ఎలా అన్నది క్యాడర్ లో ఉందని అంటున్నారు. ప్రభుత్వం అన్నాక సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏమైనా ఇబ్బందిగా ప్రజలకు ఉంటే వాటి ప్రభావం అన్ని పార్టీల మీద పడుతుందని కూడా అంటున్నారు.

ఏది ఏమైనా కూటమి పాలనలో జనసేన ముద్ర కనిపించడం లేదు అన్నది ఆ పార్టీ అభిమానులకు ఉందిట. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి వచ్చే సమావేశాలలో అయినా ఆయన పాలు పంచుకుని జనరంజకమైన నిర్ణాయాలను కేబినెట్ లో తమ పార్టీ ఆలోచనలుగా పెట్టి అమలుకు పూనుకోవాలని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News