కొత్త జిల్లాలా.. బౌండరీలా.. ఇదో చిక్కు ..!
వాస్తవానికి అప్పట్లో 26 జిల్లాలు ఏర్పాటు చేయడం సర్కారుకు తలకు మించిన భారంగా మారింది. కొన్ని కొన్ని జిల్లాలలో ఇప్పటికీ కీలక అధికారులకు శాశ్వత భవనాలు లేవు.;
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం.. కాక రేపుతోంది. ప్రస్తుతం 26గా ఉన్న జిల్లాల సంఖ్యను 32కు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఓ కీలక సలహాదారు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి రాష్ట్రంలో కులగణన జరగనుంది. దీనికిముందు జిల్లాలు, నియోజకవర్గాలు, డివిజన్ల పరిధులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్ల వరకు కుదరదు. దీంతో ఈ వ్యవహా రంపై ప్రభుత్వానికి ఒత్తిడి పెరిగింది. వాస్తవానికి వైసీపీ హయాంలో 13గా ఉన్న జిల్లాలను పార్లమెంటు సెగ్మెంట్లను పరిగణనలోకి తీసుకుని 26 జిల్లాలుగా విభజించారు.
వాస్తవానికి అప్పట్లో 26 జిల్లాలు ఏర్పాటు చేయడం సర్కారుకు తలకు మించిన భారంగా మారింది. కొన్ని కొన్ని జిల్లాలలో ఇప్పటికీ కీలక అధికారులకు శాశ్వత భవనాలు లేవు. కొన్ని డివిజన్లలో అయితే.. అద్దె భవనాల్లోనే అన్నీ జరుగుతున్నాయి. వాటికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయారు. ఈ పరిణామాలను గుర్తించి..వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. కొత్తగా జిల్లాల విభజనను భుజాన వేసుకుందనే వాదన వినిపిస్తోంది.
ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా ఉన్నా.. వీటికి అయ్యే నిధుల వ్యవహారం కూడా ఇబ్బందేనని చెబుతున్నా రు. ఉదాహరణకు ఒక జిల్లా ఏర్పాటు చేస్తే.. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ సహా.. ఎస్పీ ఆఫీసులను ఏర్పాటు చేయాలి. మండల కేంద్రాల్లో అధికారులను నియమించాలి. ఇవన్నీ ప్రస్తుతం శక్తికి మించిన వ్యవహారం. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారులకే పనులు మెండుగా ఉంటున్నాయి. మరోవైపు రిక్రూట్‌మెంట్లు నిలి చిపోయాయి. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలకు అధికారులను ఎలా తీసుకురావాలన్నది ప్రశ్న.
ఇదిలావుంటే.. నియోజకవర్గాల మార్పు, చేర్పులు లేకపోయినా..కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి మా రుతుంది. తద్వారా అది తమ ఓటుబ్యాంకుపై ప్రభావం పడేలా చేస్తుందని నాయకులు చెబుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మార్పులు, చేర్పుల విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రభావంపై కూడా సర్కారు ఆలోచన చేస్తోంది. దీంతో ప్రజలు లేవనెత్తే సమస్యలు, ప్రశ్నలపై మాత్రమే ప్రస్తుతం పరిష్కారానికి పరిమితం కావాలని, కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంపై మరోసారి చూద్దామని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.