మ‌రింత సెగ: మెడిక‌ల్ కాలేజీల పీపీపీలో యూట‌ర్న్‌.. !

ఇక మిగిలిన 40% నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి మొత్తంగా 10 కాలేజీలను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.;

Update: 2025-09-20 17:31 GMT

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవహారం యూటర్న్ తీసుకుంది. వైసిపి హయాంలో తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలో విషయంలో ఐదు కాలేజీలను అప్పట్లోనే నిర్మాణం చేపట్టారు. వీటిలో మూడు కాలేజీల్లో తరగతులు కూడా నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10% పనుల కోసం వేచి చూస్తున్నాయి. ఇక, మిగిలిన పది కాలేజీల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్- ప్రైవేట్- పార్టనర్ షిప్ పేరుతో `పిపిపి` విధానాన్ని అవలంబించాలని నిర్ణయించుకుంది. దీనిపై సర్వత్ర విమర్శలు అయితే వచ్చాయి.

మేధావి వర్గాల నుంచి రాజకీయ వర్గాల వరకు తటస్థుల నుంచి సొంత పార్టీలోని ఒకరిద్దరు నాయకుల వరకు కూడా వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని తప్పుపట్టారు. సహజంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే వైద్య కళాశాలలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంతో పట్టుపడితే తప్ప భారీ సంఖ్యలో మెడికల్ కాలేజీ లను కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కేటాయించే పరిస్థితి లేదు. అటువంటిది వైసిపి హయాంలో భారీ సంఖ్యలో కళాశాలలను కేటాయించడం.. వాటికి అయ్యే ఖర్చులో 60 శాతం నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే.

ఇక మిగిలిన 40% నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి మొత్తంగా 10 కాలేజీలను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిలో ఏడు కాలేజీలకు పునాదుల నుంచి బిల్డింగుల వరకు నిర్మాణాలు కొంతమేరకు పూర్తి కాగా.. మిగిలిన వాటి సంగతి మాత్రం ఇంకా ప్రారంభం కూడా నోచుకోని పరిస్థితిలో ఉన్న మాట వాస్తవమే. అయితే, వీటిని కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోగా వీటిని పిపిపి విధానంలో అప్పగించాలని భావించింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో కొంతమేరకు సీఎం చంద్రబాబు వెనకడుగు అయితే వేశారు.

ప్రజల నుంచి సర్వే తీసుకుని దాని ప్రకారం ముందుకు సాగాలని కూడా భావించారు. అయితే, అంతర్గతంగా జరిగిన చర్చలు. అదేవిధంగా మంత్రులు, కీలక నాయకుల నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో పిపిపి విధానానికే ప్రభుత్వం ముగ్గు చూపింది. తాజాగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఐదు కాలేజీలను పిపిపి విధానంలో అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఇక్కడ చిత్రం ఏంటంటే పి పిపి విధానంలో కూడా కొన్ని పక్కా నిబంధనలు నియమాలు ఉంటాయి. ఇప్పుడు వాటిని కూడా సరళీకరించటం, ఆ నిబంధనలో కూడా మార్పులు తీసుకురావడం వంటివి మరో వివాదానికి దారితీస్తున్నాయి.

సహజంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు దక్కించుకునేందుకు ఇద్దరి నుంచి కనీసం ఐదుగురు వరకు పోటీ పడాలనే నిబంధన ఉంది. అలాంటిది మెడికల్ కాలేజీల విషయానికి వస్తే కేవలం ఒక్కరు టెండర్ వేసినా కాలేజీలను అప్పగిస్తామని నోటిఫికేషన్లో పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీనిపై ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఏర్పడుతోంది. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న పిపిపి విధానం మళ్లీ కొండెక్కే అవకాశమే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పిపిపి విధానం కరెక్ట్ అని సీఎం చంద్రబాబు చెబుతుండగా, ఆయా కాలేజీల‌ను నిర్మించేందుకు 6000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించలేదా అనే సందేహాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ఇది ఎంతవరకు దారితీస్తుంది.. ఏ మేరకు ఇది సక్సెస్ అవుతుంది.. అనేది అనుసరించే విధానాన్ని బట్టి, ప్రభుత్వం వేసే అడుగులను బట్టి ఆధారపడి ఉంటుందనేది స్పష్టం అవుతోంది. మ‌రోవైపు దీనిపై చేస్తున్న నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News